మీరాభాయ్ చాను నుంచి నీరజ్ చోప్రా వరకు…! టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలోనూ మెరుగైన స్థానం దక్కించుకుంది. మెడల్స్ లెక్కల్లోనూ కొత్త మార్క్‌ను సెట్ చేసింది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు గెలవడమే రికార్డుగా ఉండేది…?! కానీ ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది..! టోక్యో వేదిక నుంచి మన క్రీడాకారులు భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందన్న ఆశలు రేపారు.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ .. గతంలో ఎన్నడూ లేనంత గొప్ప ప్రదర్శన చేసింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలను గెలుచుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాల రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాల రికార్డే ఇప్పటి వరకు అత్యధికం. ఆ రికార్డును చెరిపేసింది. పతకాలు సాధిస్తారని ఆశించిన ఆటగాళ్లు నిరాశ పరిచినా.. కొత్త స్టార్లు ముందుకొచ్చి సంచలనాలు సృష్టించారు. ఇక కమల్‌ప్రీత్ కౌర్, అతిథి అశోక్ లాంటి వాళ్లు తృటిలో పతకాలు చేజార్చుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి ఛాను సిల్వర్ పతకం సాధించడంతో భారత పతకాల వేట ప్రారంభమైంది. బ్యాడ్మింటన్‌లో సింధు కాంస్యంతో అలరించింది. తొలిసారి ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొన్న బాక్సర్ లవ్లీనా కాంస్యంతో మెరిసింది. పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బ్రాంజ్ మెడల్ సాధించగా.. రెజ్లర్ రవికుమార్ దహియా రజత పతకం అందుకున్నాడు. భజరంగ్ పునియా కాంస్యం.. నీరజ్ చోప్రా స్వర్ణ పతకాలు భారత్ ఒలింపిక్ చరిత్రను తిరగరాశాయి.
మొదటి రోజే సిల్వర్ మెడల్‌తో చానూ క్రీడాభిమానుల్లో ఉత్సాహం నింపింది. అప్పటి నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందా అని అంతా ఆశగా చూశారు. మెడల్స్ తప్పని సరిగా వస్తాయని ఆశించిన షూటర్స్ ఈసారి దారుణంగా విఫలమయ్యారు. ఆర్చరీలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో ఇండియాలో క్రికెట్ తప్పా మిగితా గేమ్స్‌కు ప్రాధాన్యం లేదు.. ఒలింపిక్స్‌లో ఎప్పుడైనా ఒకటి అరా పతకాలతో సరిపెట్టుకోవాల్సిందే అనే వాదనలు వినిపించాయి. సెమీస్ వరకు మన ఆటగాళ్లు చాలామంది ఆశలు రేకెత్తించారు. అంతలోనే ఊసురుమనిపించారు. తుది సమరాల్లో ఒత్తిడికి లోనై విఫలమయ్యారు. బ్యాడ్మింటన్‌లో సింధు ఈ సారి బంగారు పతకాన్ని సాధిస్తుందని అంతా ఆశించారు. అయితే సెమీస్‌లో సింధు పోరాడి ఓడింది. ఆ తర్వాత పడిలేచిన కెరటంలా కాంస్యాన్ని దక్కించుకోగలిగింది.
రెండ్రోజుల కిందవరకు భారత్ పట్టికలో ఉన్నవి కేవలం ఐదు పతకాలే ..! శనివారం అదితి నిరాశ పరచినా.. బజరంగ్ పునియా కాంస్యంతో అదరగొట్టాడు. నీరజ్ చోప్రా పసిడి కలను సాకారం చేశాడు. అథ్లెటిక్స్‌లో వందేళ్ల చరిత్రలో తొలి పతకం సాధించి చరిత్ర నెలకొల్పాడు.. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 47వ స్థానంలో నిలిచింది. ఇది ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ అత్యుత్తమ ప్రదర్శన. గత రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలతో 67 స్థానంతో సరిపెట్టుకుంది. నీరజ్ గోల్డ్ కొట్టకుంటే ఈసారి కూడా మన ర్యాంక్ చాలా వెనకబడే ఉండేంది. అయితే గోల్డ్ మెడల్‌తో భారత్ దాదాపు 20 స్థానాల ముందుకు వచ్చేసింది.