Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. నాలుగో రోజున మూడు మెడల్స్ భారత్ ఖాతాలో చేరాయి. ఓ రజతం సహా రెండు కాంస్యాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. మహిళల జూడో 48 కేజీల విభాగంలో సుశీలా దేవి రజతం కైవసం చేసుకుంది. అటు పురుషుల జూడో 60 కేజీల విభాగంలో విజయ్ కుమార్ యాదవ్, వెయిట్ లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ కాంస్య పతకాలను దక్కించుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.
Read Also: IND Vs WI: రెండో టీ20లో వెస్టిండీస్ విజయం.. 1-1తో సిరీస్ సమం
ఈ నేపథ్యంలో ఐదో రోజు మరిన్ని పతకాలను చేజిక్కించుకునేందుకు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. హైజంప్‌లో తేజస్విని శంకర్, డిస్కస్ త్రో ఫైనల్‌లో సీమా పునియా, నవజీత్ కౌర్ ధిల్లాన్ ఈరోజు పోటీపడుతున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటలకు పురుషుల 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హీట్ 2 పోటీల్లో శ్రీహరి నటరాజ్ పాల్గొంటాడు. సాయంత్రం 4:10 గంటలకు పురుషుల 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ హీట్‌లో అద్వైత్ పేజ్, కుషాగర రావత్ పోటీ పడతారు. రాత్రి 10 గంటలకు బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్, మలేషియా తలపడనున్నాయి. మరోవైపు రాత్రి 11: 45 గంటలకు పురుషుల 67 కేజీల విభాగంలో 16 రౌండ్‌లో రోహిత్ టోకాస్ తలపడనున్నాడు. అటు పలువురు అథ్లెట్లు, జిమ్నాస్టిక్స్ ప్లేయర్లు కూడా పలు ఈవెంట్లలో పాల్గొని పతకాలను సాధించే అవకాశం ఉంది.