లక్నోలోని ఎకానా స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20కి దూరమయ్యాడు. కాలి గాయంతో నాలుగో టీ20కి దూరమయ్యాడు. ఐదవ టీ20కి కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. నాలుగో టీ20లో గిల్ స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడనున్నాడు.
టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మెడ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన గిల్.. పొట్టి సిరీస్‌లోని తొలి మూడు టీ20ల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 32 పరుగులే చేశాడు. కటక్ మ్యాచ్‌లో 4 పరుగులు, ముల్లన్‌పూర్ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా ఔట్ అయ్యాడు. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం సిరీస్‌లో అతని సగటు 10.66 కాగా, స్ట్రైక్‌రేట్ 103.22గా ఉంది. 2025లో ఇప్పటివరకు గిల్ 15 టీ20 మ్యాచ్‌ల్లో 291 పరుగులే సాధించాడు. అతని సగటు 24.25 కాగా, స్ట్రైక్‌రేట్ 137.26 మాత్రమే. గిల్ గాయం టీమిండియాకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్ జట్టును తయారు చేసుకునే పనిలో ఉంది. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు మ్యాచ్‌ల తర్వాత జనవరి 2026లో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు, ఫామ్ జట్టు కూర్పుపై ప్రభావం చూపిస్తున్నాయి. కీలక ఇన్నింగ్స్‌లు రాకపోవడంతో సోషల్ మీడియాలో శుభ్‌మన్ గిల్ ఫామ్‌పై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2026 టీ20 వరల్డ్‌కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.
Also Read: CM Chandrababu: నిధులు ఖర్చు చేస్తే.. అదనంగా కేంద్రం నుంచి రాబట్టుకోవచ్చు!
శుభ్‌మన్ గిల్ గైర్హాజరీతో సంజూ శాంసన్‌కు మరోసారి అవకాశం దక్కనుంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సంజూ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేదు. అయితే 2024లో ఓపెనర్‌గా ఆడిన సమయంలో సంజూ అద్భుత ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 512 పరుగులు చేశాడు. అతడి సగటు 39.38 కాగా, స్ట్రైక్‌రేట్ 182.20గా ఉంది. నాలుగో టీ20లో అవకాశం వస్తే.. సంజూ తన స్థానం పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో సంజూ ఉంటదనంలో ఎలాంటి సందేహం లేదు.