భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. స్టేడియం పరిసరాల్లో భారీ పొగమంచు కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.25 వరకు అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించారు. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో చివరికి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశతో మైదానం వీడారు. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ వేదికల ఎంపిక విషయంలో వాతావరణ పరిస్థితులను బీసీసీఐ అస్సలు పరిగణనలోకి తీసుకోలేదని కామెంట్ల వర్షం కురిపించారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రతిసారి అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.
అభిమానుల ఆగ్రహం నేపథ్యంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇకపై వేదికల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ‘లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా టీ20 రద్దు కావడం ప్రతి ఒక్కరిని తీవ్ర నిరాశకు గురిచేసింది. నాలుగో టీ20 కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మ్యాచ్ జరిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాం. పొగమంచు కారణంగా మాక్ రద్దు చేయాల్సి వచ్చింది. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో మ్యాచ్ల షెడ్యూళ్ల విషయంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాం’ అని రాజీవ్ శుక్లా చెప్పారు. ఇక చివరి టీ20 మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్లో జరగనుంది.