మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయపడిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో యువ క్రికెటర్ ఆయుష్ బదోనిని జట్టులోకి వచ్చాడు. బదోని ఈరోజు అరంగేట్రం చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మరో ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డికి అవకాశం దక్కింది. వడోదర వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని గిల్ సేన చూస్తోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్: డెవన్ కాన్వే, హెన్రీ నికోలస్, విల్ యంగ్, డారెల్ మిచెల్, గ్లెన్ పిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మిచెల్ బ్రేస్ వెల్ (కెప్టెన్), జకారీ ఫోక్స్, జైడన్ లెనెక్స్, కేల్ జెమీసన్, క్రిస్టియన్ క్లార్క్ .