T20 World Cup: టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు చూపుతూ వివాదం చేసిన బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌ను తీసుకుంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీని బాయ్‌కాట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఐస్లాండ్ పాకిస్తాన్‌పై ట్రోలింగ్ చేస్తుంది. ఐస్లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో ..‘‘ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము’’ అని సెటైర్లు వేసింది. ‘‘టీ20 వరల్డ్ కప్ ఆడటంపై పాకిస్తాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. ఫిబ్రవరి 2న వారు వైదొలిగితే, వెంటనే మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఫిబ్రవరి 7న విమాన షెడ్యూల్ కారణంగా కొలంబో చేరుతామో లేదో. ’’ అంటూ పోస్ట్ చేసింది.
Read Also: Shruti Haasan: హే శృతి.. నువ్వేనా.. ఇలా అయిపోయావ్ ఏంటి?
అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) అధికారులు కామెంట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ, ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ శుక్రవారం లేదా సోమవారం తమ నిర్ణయం వెల్లడిస్తామని నఖ్వీ చెప్పారు. తమకు లాగే బంగ్లాదేశ్‌కు కూడా తటస్థ వేదికలపై ఆడేందుకు అవకాశం ఇవ్వాలని నఖ్వీ డిమాండ్ చేశారు. పాక్ తన అన్ని మ్యాచుల్ని శ్రీలంకలో ఆడుతోంది. బంగ్లాదేశ్ కూడా తాము భారత్‌లో ఆడమని తమ వేదికల్ని కూడా శ్రీలంకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ అంగీకరించపోవడంతో టోర్నీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.