Team India: వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ)ను ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నాలుగేళ్లలో భారత్ భారీ స్థాయిలో మ్యాచ్‌లను ఆడబోతోంది. 2023, మే నుంచి 2027, ఏప్రిల్ మధ్య 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు ఆడనుంది. ఇవి కాకుండా ఐసీసీ ఈవెంట్లు అదనం. అంటే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలు కూడా టీమిండియా ఆడనుంది. వచ్చే నాలుగేళ్లలో టీమిండియా రెండు సార్లు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చివరిసారిగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 1992లో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడాయి. ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0తో ఇండియాను ఓడించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు టెస్టుల సిరీస్ ఆడలేదు.
కొత్త ఎఫ్‌టీపీలో భాగంగా టీమిండియా మొదటి సిరీస్‌ను వెస్టిండీస్‌లో ఆడుతుంది. వచ్చే ఏడాది జులై-ఆగస్ట్‌లో వెస్టిండీస్ వెళ్లనున్న టీమిండియా.. అక్కడ రెండు టెస్ట్‌లు, రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. 2024 జనవరి, మార్చి మధ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ జరిగే అవకాశం ఉంది. కాగా వచ్చే నాలుగేళ్ల కాలంలో ఐదు ఐసీసీ టోర్నీలు జరగనున్నాయి. 2023లో ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ ఒకటి కాగా.. 2024లో టీ20 వరల్డ్‌కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో టీ20 వరల్డ్‌కప్, 2027లో వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది.
2023లో టీమిండియా షెడ్యూల్: జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అంతేకాకుండా జనవరి-ఫిబ్రవరి మధ్య ఆస్ట్రేలియాతో స్వదేశంలోనే నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది. జూలైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లి అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. సెప్టెంబర్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. నవంబర్‌లో మరోసారి స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20 ల సిరీస్ ఆడుతుంది. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
