Harsha Bhogle Interesting Tweet On Virat Kohli Innings: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ సాధించిన త్రిల్లింగ్ విజయంలో విరాట్ కోహ్లీ అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే! ఒకానొక దశలో భారత్ ఓడిపోతుందని భావిస్తే.. చివరివరకూ క్రీజులో నిలబడి, హార్దిక్ పాండ్యా(40) సహాయంతో జట్టుని గెలిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం.. భావోద్వేగంతో కంటితడి పెట్టాడు. ఈ దృశ్యం గురించి హర్ష భోగ్లే ట్వీట్ చేస్తూ.. ‘‘నేను చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీని చూస్తున్నా. ఇన్నేళ్లలో అతడు కంటతడి పెట్టడం ఎప్పుడూ చూడలేదు. కానీ, తొలిసారి పాక్‌పై విజయం సాధించిన తర్వాత ఇవాళ చూశా. ఇది ఎన్నటికీ మరువలేని సంఘటన’’ అని చెప్పుకొచ్చాడు. అంటే.. ఈ మ్యాచ్ కోహ్లీకి ఎంత విలువైనదో ఆ కన్నీళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చని హర్ష భోగ్లే పరోక్షంగా అలా చెప్పాడు.
మరోవైపు.. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదొక అద్భుతమైన పరిణామమని, ఇలాంటి తరుణంలో తనకు మాటలు రావడం లేదని అన్నాడు. అసలు ఇది ఎలా జరిగిందో కూడా ఐడియా రావడం లేదన్నాడు. క్రీజులో ఉన్నప్పుడు మనం సాధించగలమని హార్దిక్ నమ్మాడని, చివరివరకూ క్రీజ్‌లో ఉంటే అది సాధ్యం అవుతుందని అనుకున్నామన్నాడు. తాము అనుకున్నదే చేసి చూపించామని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. షహీన్ షా అఫ్రిదితో పాటు హారిస్‌ను ఎటాక్ చేస్తే.. పాక్ ఒత్తిడికి గురవుతుందని తమకి తెలుసని, అలాగే చివరి ఓవర్ నవాజ్ వేస్తాడని కూడా ముందే ఊహించామన్నాడు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన సమయంలో.. రెండు సిక్స్‌లు కొట్టడం నిజంగా అద్భుతమన్నాడు. తన శక్తి సామర్థ్యం మీద నమ్మకం ఉంచానని, హార్దిక్ కూడా చాలా మద్దతుగా నిలిచాడని పేర్కొన్నాడు. మద్దతుగా నిలిచిన అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.
ఇదిలావుండగా.. టీమిండియాను ముందుండి గెలిపించడంతో విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. మైదానంలో క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ఎగిరి గంతులేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. నిన్నటిదాకా విమర్శించిన వాళ్లు కూడా ఇప్పుడు కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ‘ద కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ క్యాప్షన్ పెట్టి, కోహ్లీకి సంబంధించిన ఒక అద్భుతమైన ఫోటోని షేర్ చేసింది.