రాజస్థాన్ రాయల్స్ జట్టుపై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో రాజస్థాన్ జట్టు వ్యూహాలను భజ్జీ మెచ్చుకున్నాడు. గతంలో ఏ జట్టు కూడా అశ్విన్‌ను ఉపయోగించుకోని రీతిలో రాజస్థాన్ జట్టు వాడుకుందని హర్భజన్ గుర్తుచేశాడు. అశ్విన్ ఆల్ రౌండర్ సామర్థ్యాలపై విశ్వాసం చూపినందుకు ప్రతిఫలంగా ఆ జట్టు ఎంతో మేలు పొందిందని కూడా తెలిపాడు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో బట్లర్‌తో పాటు అశ్విన్‌కు కూడా భాగం ఉందన్నాడు.
RCB: ఇదీ ఆర్సీబీ సత్తా అంటే.. ప్రపంచంలోనే రెండో జట్టుగా రికార్డు
అశ్విన్ బ్యాటింగ్ ప్రతిభను గుర్తించి రాజస్థాన్ యాజమాన్యం బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు దించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అశ్విన్ కూడా రాణించడం శుభపరిణామం అని పేర్కొన్నాడు. అశ్విన్‌ను బీభత్సంగా వాడుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ మాత్రమేనని భజ్జీ స్పష్టం చేశాడు. కాగా అశ్విన్ ఈ సీజన్‌లో బ్యాటింగ్ విషయంలో 30కి పైగా సగటుతో 183 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లో 9 కంటే తక్కువ ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అశ్విన్ ఒక సీజన్‌లో 150కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.