ఐపీఎల్లో రెండు కొత్త జట్లు ఈరోజు అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే ఈ పోరు కేఎల్ రాహుల్ టీమ్‌పై హార్డిక్ పాండ్యా జట్టు విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం 159 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే లక్నో బౌలర్ చమీర షాకిచ్చాడు. శుభమన్ గిల్ డకౌట్ కాగా విజయ్ శంకర్ 4 పరుగులకే వెనుతిరిగాడు. ఈ దశలో వేడ్ (30), కెప్టెన్ హార్డిక్ పాండ్యా (33) ఆదుకున్నారు. ఆచితూచి వీరిద్దరూ బ్యాటింగ్ చేయడంతో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో గుజరాత్ కోలుకుంది. వీరు అవుటైనా డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాటియా ( 24 బంతుల్లో 40 నాటౌట్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ టీమ్ ఛేదించి టోర్నీలో తొలి గెలుపును తన ఖాతాలో వేసుకుంది.