T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఈవారం నాకౌట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. బుధవారం నాడు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. గురువారం నాడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మేరు సెమీఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరీ) జాబితాను ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా రిచర్డ్ కెటిల్‌బరో, మైఖేల్ గాఫ్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీ బాధ్యతలు చేపడతాడు.
అటు భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు కుమార ధర్మసేన- పాల్ రీఫెల్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. క్రిస్ గాఫ్‌నే మూడో అంపైర్‌గా, రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ జాబితాను చూసి భారత అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దరిద్రపుగొట్టు అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేడని, ఇది భారత్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొంటున్నారు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్ ఓడిపోయిన ప్రతి మ్యాచ్‌కు అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరోనే ఉన్నాడు. దీంతో గత 9 ఏళ్లుగా భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి కెటిల్ బరోనే కారణమని, ఈసారి అతను లేడు కాబట్టి సెమీస్‌లో భారత్ విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ కూడా భారత్‌దేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెమీస్‌లో ఇంగ్లండ్ చిత్తవ్వడం ఖాయమని, ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చినా.. పాక్ తలపడినా.. రోహిత్ సేన విజయాన్ని ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్ లేదా థర్డ్ అంపైర్‌గా వ్యవహరించిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లను టీమిండియా ఓడిపోయింది. దీంతో రిచర్డ్ కెటిల్‌బరో ఐరన్ లెగ్ అని టీమిండియా అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు.
