టీమిండియా జట్టులో గత రెండేళ్లుగా పుజారా, రహానెలకు బీసీసీఐ వరుస అవకాశాలను ఇస్తోంది. అయినా వాళ్లిద్దరూ అరకొర సందర్భాల్లో తప్పితే పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా పుజారా అయితే రెండేళ్లుగా సెంచరీనే చేయలేదు. ఇక రహానె పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రహానె ఓ ఇన్నింగ్స్‌లో బాగా ఆడితే 10 ఇన్నింగ్సులు ఆడకుండానే జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. దీంతో జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసే ఉదాహరణ. పుజారా, రహానె మెరుగ్గా ఆడితే ఈ టెస్టు సిరీస్‌ను కచ్చితంగా టీమిండియానే గెలుచుకుని ఉండేది. కానీ అలా జరగలేదు.
ఈ నేపథ్యంలో భారత టెస్టు క్రికెట్‌కు విహారి అవసరం వచ్చిందని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. రహానెను బీసీసీఐ ప్రోత్సహించినట్లే.. హనుమ విహారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అసవరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కనీసం రెండు, మూడు టెస్టు సిరీస్‌ల వరకు అయినా విహారికి అవకాశాలు ఇవ్వాలని గంభీర్ సూచించాడు. విహారి అద్భుతమైన ఆటగాడు అని… అతడికి వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.