Gautam Gambhir Says India did not get World Cups because of MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. ధోనీ వల్ల 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్ గెలుచుకోలేదని.. ప్లేయర్స్ అందరూ సమష్టిగా రాణించడంతోనే ట్రోఫీలు దక్కాయన్నాడు. ధోనీ పీఆర్ ఏజెన్సీ అతన్ని పెద్ద హీరో చేసిందని, నిజానికి రెండు మెగా టోర్నీల్లో భారత్ గెలవడానికి ప్రధాన కారణం స్టార్ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ అని గౌతీ పేర్కొన్నాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2023 నుంచి భారత్ ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2013 ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది. దాంతో ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం ఎంఎస్ ధోనీకే సాధ్యమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. ఈ ట్వీట్లపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ఓ జాతీయ మీడియాతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘ఐసీసీ టోర్నీలలో టీమిండియా వరుస వైఫల్యాలకు కారణం ఏంటంటే.. వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యత జట్టు ప్రదర్శనకు ఇవ్వకపోవడమే. మిగతా జట్లు సమష్టి ప్రదర్శనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడానికి ప్రధాన కారణం యువరాజ్ సింగ్. రెండు టోర్నీల్లోనూ యువీ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడి ప్రదర్శన వల్లే వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు వెళ్ళింది. కానీ ఎంఎస్ ధోనీ పీఆర్ ఏజెన్సీ మాత్రం మహీని హీరోని చేశాయి’ అని అన్నాడు.
Also Read: Bhola Shankar: 1988లో చివరి సినిమా.. ‘భోళాశంకర్’ చిరంజీవి ఆగస్ట్ సక్సెస్ రేటు పెంచేనా!?
‘ప్రపంచకప్ గెలుస్తానని యువరాజ్ సింగ్ ఎపుడూ చెబుతుండేవాడు. 2011, 2007 ప్రపంచకప్‌ల్లో అతనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడనుకుంటా. నాకు గుర్తులేదు.. 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో షాహిద్ అఫ్రిది ఈ అవార్డు తీసుకున్నాడు. అయితే 2007, 2011 ప్రపంచకప్ గురించి మాట్లాడుకున్నప్పుడు యువరాజ్ పేరే రాదు. ఎందుకంటే పీఆర్ బృందం క్రెడిట్ మొత్తం ధోనీకి దక్కేలా చేసింది. మిగతా ఆటగాళ్ల పాత్ర ఏమీ లేనట్టు చేసేశారు. సమష్టి ప్రదర్శనలతోనే ట్రోఫీలు దక్కాయి. ఐసీసీ లాంటి పెద్ద టోర్నీలు గెలవడం ఈ ఒక్క ఆటగాడి వల్ల సాధ్యం కాదు’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
‘ఒక్క ఆటగాడి వల్ల ట్రోఫీలు వస్తే.. భారత్ ఇప్పటికే 5 నుంచి 10 ప్రపంచకప్‌లు గెలిచేది. చాలా మంది ఈ విషయాన్నీ ఒప్పుకోరు. ఇప్పటికైనా వ్యక్తి పూజ మానేసి.. జట్టు ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వండి. వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోతుంది’ అని గౌతీ అభిప్రాయపడ్డాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
Also Read: TCS: ఉద్యోగానికి గుడ్ బై చెబుతున్న మహిళా టెక్కీలు.. కారణం ఇదే..