ఐపీఎల్‌లో ఈరోజు ఆసక్తికర సమరం జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే గతంలో 9 ఏళ్ల పాటు సన్‌రైజర్స్ జట్టులో ఆడిన డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. 9 ఏళ్ల పాటు సన్‌రైజర్స్ జట్టుతో ఆడటం వల్ల ఆ జట్టుతో వార్నర్‌కు మంచి అనుభవం ఉంది. కానీ గత ఏడాది అవమానకర రీతిలో వార్నర్‌కు తుదిజట్టులో కూడా చోటు దక్కలేదు. మేనేజ్‌మెంట్‌తో తారాస్థాయికి చేరిన విభేదాల కారణంగా చివరకు వార్నర్ జట్టు నుంచి తప్పుకున్నాడు.
కట్ చేస్తే.. వార్నర్‌ను మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా రూ.6 కోట్లు వెచ్చించి మరీ వార్నర్‌ను ఢిల్లీ జట్టు దక్కించుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున వార్నర్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలతో మొత్తం 264 పరుగులు చేసి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఇప్పుడు గత ఏడాది చేదు అనుభవాల దృష్ట్యా వార్నర్ సన్‌రైజర్స్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటాడా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వార్నర్ కచ్చితంగా సన్‌రైజర్స్ జట్టుపై సెంచరీ చేస్తాడని టీమిండియా మాజీ బౌలర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్ తరఫున నిలకడగా ఆడిన ఆటగాళ్లలో వార్నర్ ఒకడని.. అతడి సారథ్యంలోనే 2016లో సన్‌రైజర్స్ టీమ్ టైటిల్ గెలిచిందని అతడు గుర్తుచేశాడు. కాబట్టి సన్‌రైజర్స్ బౌలర్లు వార్నర్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పీయూష్ చావ్లా సూచించాడు.