Darren Sammy: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు వెస్టిండీస్ అర్హత సాధించకపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తమ జట్టుకు ఈ పరిస్థితి దాపురించడానికి ఆర్ధిక విధానాలే కారణమని ఆరోపించాడు. ఆటగాళ్లకు తమ బోర్డు ఆర్ధిక భద్రత కల్పిస్తే జట్టు గాడిన పడుతుందని డారెన్ సామీ ఆశాభావం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తరహాలో ఇతర లీగుల్లో తమ ఆటగాళ్లు ఆడటాన్ని వెస్టిండీస్ బోర్డు అడ్డుకోలేదని.. ఎందుకంటే బీసీసీఐ తరహాలో తమది ధనిక బోర్డు కాదని డారెన్ సామీ స్పష్టం చేశాడు. భారత ఆటగాళ్లను బ్యాకప్ చేయడానికి బీసీసీఐ దగ్గర చాలా డబ్బు ఉందనే విషయం అందరికీ తెలుసన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ఇండియా-ఎ గ్రేడ్ ఆటగాడికి ఏడాదికి రూ.7 కోట్ల మ్యాచ్ ఫీజు అందుతుందని.. కానీ తమ బోర్డు ఇచ్చే ఫీజుతో ఆటగాళ్లు కిరాణా సామాను కూడా కొనలేరని.. అందుకే ఇతర దేశాలలో లీగులు ఆడుతున్నారని వివరించాడు.
Read Also: China: ఉద్యోగులు పారిపోతున్నారని ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన చైనా..
ఆర్ధికంగా బలహీనంగా ఉన్న సమయంలో చిన్నదేశాల బోర్డులు తమ ఆటగాళ్లను వేరే చోట ఆడకుండా నియంత్రించడం కష్టతరమైన పని అని డారెన్ సామీ వెల్లడించాడు. సాధారణంగా ఓ ఆటగాడికి సంపాదించే సమయం చాలా తక్కువ ఉంటుందని.. ఆ పీరియడ్‌లోనే సత్తా చాటి డబ్బులు సంపాదించాలని సామీ అన్నాడు. దేశం అంటే ప్రేమ కోసం ఆటలాడే రోజులు పోయాయని.. ఎందుకంటే ఆ ప్రేమ తమకు తిండి పెట్టలేదని.. కనీసం సూపర్ మార్కెట్‌లో కిరాణా సామాను కూడా కొనుగోలు చేయలేమని సామీ పేర్కొన్నాడు.