China Locks Down Area Around iPhone Factory: చైనాలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ ను కఠినంగా అమలు చేస్తోంది. చైనా ప్రజల నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అధ్యక్షుడు జి జిన్ పింగ్ పై విమర్శలు, నిరసన వ్యక్తం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. తాజాగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని బుధవారం దిగ్బంధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ చేశారు. కోవిడ్ నివారణ వాలంటీర్లు, అవసరమైన కార్మికులు తప్ప ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని చైనా ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టెస్టులు, వైద్యం పొందడానికి తప్పితే ఇతర ఏ అవసరాలకైనా ప్రజలు బయటకు రావద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది.
Read Also: Indian Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..
తైవాన్ టెక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ నడుపుతున్న ఈ ప్రాంతం వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇటీవల ఈ ప్రాంతం నుంచి కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వ కఠిన నియమాలు తట్టుకోలేక ఫెన్సింగ్ దూకి పారిపోతున్న వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ చర్య తరువాత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జెంగ్‌జౌ నగరంలో అంతా వర్క్ ఫ్రం హోం చేయాలని, కీలక సంస్థలు మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తాయని, వైద్యం, నిత్యావసర పంపిణీ వాహనాలను మాత్రమే వీధుల్లోకి అనుమతిస్తామని తెలపింది అక్కడి ప్రభుత్వం. ఎవరైనా కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. ఒకవేళ ఫాక్స్‌కాన్ కార్మికులు వస్తే అధికారుల వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు కఠినమైన ఐసోలేషన్ పాటించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే చైనాలో వరసగా మూడవ రోజు బుధవారం 2,000 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్న కార్మికులకు బోనస్ నాలుగు రెట్టు పెంచుతామని కంపెనీ ప్రకటించింది. జెంగ్ జౌ ఉన్న హెనాన్ ప్రావిన్స్ లో బుధవారం అధికారికిగా 359 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అంతకుముందు రోజు కన్నా 104 కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న కారణంగా దక్షిణ చైనా తయారీ కేంద్రమైన గ్వాంగ్ జౌ నగరంలో పాక్షిక లాక్ డౌన్ విధించారు.