ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఎందుకంటే మొయిన్ అలీకి వీసా సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అతడు ఇండియా రావడానికి ఇప్పటిదాకా వీసా లభించలేదని తెలుస్తోంది. మొయిన్ అలీ ప్రస్తుతం ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు.
ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించారు. మొయిన్ అలీ ఫిబ్రవరి 28వ తేదీనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడని.. 20 రోజులు గడిచినా అతడికి ఇంకా వీసా రాలేదన్నారు. దీనికి గల కారణాలేంటో స్పష్టంగా తెలియాల్సి ఉందని వివరించారు. సోమవారం నాటికి మొయిన్ అలీ వీసా సమస్య పరిష్కారం అవుతుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు. అలీకి వీసా రావడం మరింత ఆలస్యమైతే అతడు ప్రారంభ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ బంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ఆటగాళ్లు 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. క్వారంటైన్ పూర్తయ్యే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైసూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ పూర్తవుతుంది.