తింటే గ్యారలే తినాలి చూస్తే ఇండియా ,పాక్ క్రికెట్ మ్యాచ్ ఏ చూడాలి. నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం,విజయం కోసం ఆఖరి వరకు పోరాటం. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం. ఆటగాళ్లు సాధారణంగా కనిపించరు సింహాల లాగ కనిపిస్తారు.
ఇలా కేవలం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లోనే చూస్తాం.అయితే అలాంటి పోరు కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ICC మెగా ట్రోఫీలు కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఇరు దేశాల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ ఈ మధ్యలో జరగడం అసంభవమే.
అయితే క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఫైట్ త్వరలోనే ఫ్యాన్స్ ను అలరించనుంది. అయితే ఇది పురుషుల మధ్య జరిగే పోరు కాదు. ఈ మెగా ఫైట్ లో ఢీ కొనడానికి మహిళలు సై అంటే సై అంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయ్. జులై 31న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
24 సంవత్సరాల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వచ్చేసింది. ఈసారి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. కామన్‌వెల్త్ గేమ్స్ కోసం ఆస్ట్రేలియా, బార్బడోస్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే అర్హత సాధించగా తాజాగా శ్రీలంక జట్టు కూడా అర్హత సాధించింది. దీంతో టోర్నీలో పాల్గొనబోయే జట్ల సంఖ్య 8కి పెరిగింది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ లో బార్బడోస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇండియా జట్లు ఉండగా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు గ్రూప్-బి లో ఉన్నాయి.