భారత క్రికెట్ ప్రస్తుత పరిస్థితిపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ప్రస్తుతం కేవలం టీ20 క్రికెట్‌లో మాత్రమే బాగానే ఆడుతోందని, అది కూడా జట్టు సమిష్టి ఆట కంటే వ్యక్తిగత ప్రతిభ వల్లే విజయాలు సాధ్యమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ జట్టుగా విఫలమైతే.. కీలక మ్యాచ్‌ల్లో ఓటమి తప్పదని లారా హెచ్చరించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపై లారా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో గంభీర్ తీసుకుంటున్న యాదృచ్ఛిక నిర్ణయాలు సరికాదని, అవి భారత క్రికెట్‌కు నష్టం కలిగిస్తున్నాయని లారా అన్నారు. గౌతీ హయాంలో టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన భారీగా పడిపోయిందని మండిపడ్డారు.
బీబీసీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రియన్ లారా మాట్లాడుతూ… ‘టీ20 క్రికెట్‌లో భారత్ ఫలితాలు బాగున్నాయి. అయితే ఎక్కువ విజయాలు వ్యక్తిగత ఇన్నింగ్స్‌ల వల్లే సాధ్యమవుతోంది. జట్టు సమిష్టిగా ఆడిన సందర్భాలు తక్కువ. టీ20 వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీలో ఇది ప్రమాదకరం. మెగా టోర్నీలలో భారత్ జట్టుగా విఫలమైతే కీలక మ్యాచ్‌ల్లో ఓటమి తప్పదు. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విఫలమైతే అసలు సమస్యలు బయటపడతాయి’ అని అన్నారు.
Also Read: Realme P4 Power 5G Review: ‘రియల్‌మీ పీ4 పవర్’ రివ్యూ.. ‘డెడ్ లెస్ స్మార్ట్‌ఫోన్’!
‘కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావు. అతని నిర్ణయాల వల్ల భారత జట్టు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో ప్రదర్శన పూర్తిగా దిగజారింది. ఒకప్పుడు భారత్ గడ్డపై గెలవాలంటే ప్రత్యర్థి జట్లు వంద రకాల వ్యూహాలతో రావాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏ జట్టు వచ్చినా వైట్‌వాష్ చేసేస్తోంది. ఈ పరిస్థితి భారత క్రికెట్‌కు తీవ్ర ప్రమాదం. భారత క్రికెట్‌ను కాపాడాలంటే బీసీసీఐ వెంటనే గంభీర్‌ను కోచింగ్ సెటప్ నుంచి తప్పించాలి. ఆలస్యం చేస్తే తీవ్ర నష్టంజరుగుతుంది’ అని బ్రియన్ లారా హెచ్చరించారు. లారా వ్యాఖ్యలతో భారత క్రికెట్ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే కోచింగ్ నిర్ణయాలు, జట్టు ఎంపికలపై విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ వ్యవహారంపై గంభీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.