రాబోయే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. సుమారు రూ.48,390 కోట్లు రావడంపై బీసీసీఐ డబ్బుపై మోజు పడుతోందని.. క్రికెట్ ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బోర్డుకు భారీగా ఆదాయం రావడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే క్రికెట్ అనేది ఓ మతం అని.. డబ్బుకు సంబంధించింది కాదన్నాడు. కేవలం డబ్బు గురించి మాత్రమే కాకుండా ప్రతిభను వెలికితీయడానికి కూడా తోడ్పడుతుందని గంగూలీ వివరించాడు. యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఐపీఎల్ మంచి ప్రేరణ ఇస్తుందని, తద్వారా భారత జట్టుకు మేలు జరుగుతుందన్నాడు.
మన దేశంలో క్రికెట్ ఎంత బలంగా ఉందో మీడియా హక్కుల వేలంలో తేలిందని గంగూలీ అన్నాడు. అయితే వేలంలో పలికిన భారీ ధరలు ఆటగాళ్లకు ప్రేరణగా ఉండాలని ఆకాంక్షించాడు. ఈ డబ్బుతో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని సమకూరుస్తామన్నాడు. క్రికెట్‌కు ఆదరణ లేని సమయంలో పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వెళ్లి టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు వీక్షించిన అభిమానులు, మద్దతుదారులకు గంగూలీ శుభాకాంక్షలు తెలియజేశాడు. మరోవైపు గత 50ఏళ్లలో ఆటకు ఆదరణ తీసుకువచ్చిన ఆటగాళ్లకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపాడు. కాగా మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండో లీగ్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.