Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు, ఆ దేశ క్రికెట్ జట్టుపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగ్లా వ్యాప్తంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుండటంపై భారత్‌లో నిరసన వ్యక్తమవుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేకేఆర్ అతడిని వదులుకుంది. ఇదిలా ఉంటే, దీనిపై బంగ్లాదేశ్ మాజీ ప్లేయర్లు, అక్కడి ప్రభుత్వం హద్దులు మీరి భారత్‌ను విమర్శించాయి.
Read Also: Farmers vs Police: భోగాపురంలో రైతుల ఆందోళన.. గందరగోళంగా మారిన ఇళ్ల తొలగింపు..
ఇప్పుడు, భారత్ మరోసారి బంగ్లా క్రికెట్ టీమ్‌కు భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ క్రికెటర్ల బ్యాట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న SG, ఆ దేశ స్టార్ ఆటగాళ్లకు స్పాన్సర్‌షిప్ విరమించుకున అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, దౌత్య పరిణామాల నడుమ దీనిపై చర్చ నడుస్తోంది. కెప్టెన్ లిట్టన్ దాస్, యాసిర్ రబ్బీ, మోమినుల్ హక్‌లతో సహా బంగ్లాదేశ్ స్టార్లకు SG స్పాన్సర్ చేస్తోంది.
కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేసిన తర్వాత బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఐపీఎల్‌లో ఆడటానికి నో-అబ్జక్షన్ పత్రం ఇవ్వడానికి నిరాకరించింది. భద్రతా కారణాలను చూపుతూ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న రాబోయే T20 ప్రపంచ కప్ 2026లో తన మ్యాచ్‌లను భారతదేశం నుండి శ్రీలంకకు మార్చాలని కూడా ICCని అభ్యర్థించింది. వీటి తర్వాత, ఎస్‌జీ తన స్పాన్సర్‌షిప్‌పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, స్పాన్సర్‌షిప్‌ను పునరుద్ధరించకూడదనే నిర్ణయం గురించి ఆటగాళ్లకు అధికారికంగా తెలియజేయలేదు. ఎస్జీ నిర్ణయం బంగ్లాదేశ్ స్పోర్ట్స్ ఇండస్ట్రీని భారీగా దెబ్బ తీసే అవకాశం ఉంది. ఎస్‌జీ నిర్ణయం తర్వాత, మరికొందరు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
