IND Vs BAN: ఈనెల 4 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టస్కిన్ అహ్మద్ వెన్నునొప్పి కారణంగా తొలివన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ మిన్‌హజుల్ అబెడిన్ తెలిపాడు. అతడి గాయం పురోగతిని బట్టి మిగతా మ్యాచ్‌లు ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఆడటం కూడా అనుమానంగా మారింది. వార్మప్ గేమ్‌లో అతను గజ్జల్లో గాయానికి గురయ్యాడు. దీంతో తమీమ్ స్కాన్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు అబెడిన్ అన్నాడు. ఫిజియో స్కాన్ రిపోర్ట్ కావాలన్నాడని.. అది వచ్చిన తర్వాతే తొలి వన్డేలో తమీమ్ ఆడేది లేనిది తెలియనుందని పేర్కొన్నాడు.
Read Also: Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. ఈ సారి ఎలాగంటే..
కాగా మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ల కోసం టీమిండియా ఇప్పటికే బంగ్లాదేశ్ చేరుకుంది. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న కోహ్లీ, రోహిత్, రాహుల్ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ పర్యటనతో టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు మొదలు కానున్నాయి.డిసెంబర్ 4 నుంచి10 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. డిసెంబర్ 14 నుంచి 26 వరకు రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ఈ రెండు సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్లను బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.