చాలాకాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే! తనని తాను నిరూపించుకోవడానికి అవకాశాలు ఎన్ని వస్తోన్నా.. ఏదీ సద్వినియోగ పరచుకోవడం లేదు. ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన కోహ్లీ.. ఇప్పుడు కనీస పరుగులు చేసేందుకు కూడా తంటాలు పడుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. 25 బంతుల్లో కేవలం 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఎప్పట్లాగే కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో, అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
కోహ్లీ పని అయిపోయిందని, ఇక అతడ్ని పక్కన పెట్టేయాల్సిందేనని నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీలు సైతం కోహ్లీ విరామం తీసుకుంటే మంచిదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ.. పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం మాత్రం కోహ్లీకి మద్దతు తెలిపాడు. ‘ఈ గడ్డు పరిస్థితి కూడా గడిచిపోతుంది, నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు’ అంటూ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. అతనిలో ధైర్యాన్ని నూరిపోశాడు. కొన్ని రోజుల క్రితమే రికార్డుల విషయంలో కోహ్లీని అవమానించేలా ప్రవర్తించిన బాబర్.. ఇప్పుడు అతనికి మద్దతుగా ట్వీట్ చేయడంతో ప్రశంసలు అందుకుంటున్నాడు. కష్టకాలంలో ఉన్న కోహ్లీకి కావాల్సింది మద్దతే అని, బాబర్ అతనికి అండగా నిలిచి స్పోర్ట్స్‌మేన్షిప్ చాటాడని అతడ్ని కొనియాడుతున్నారు.
కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. కోహ్లీ సహా ప్రధాన బ్యాట్స్మన్లందరూ చేతులెత్తేయడంతో.. ఇంగ్లండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేక, 146 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా సరిగ్గా నిలవలేకపోయారు. ఓపెనర్లు కనీస ఓపెనింగ్ స్కోరు జోడించి ఉన్నా, మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బౌలర్ రీస్ టాప్లీ ఆరు వికెట్లతో మెరిశాడు.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022