టీ 20 ప్రపంచకప్ అసలు పోరు షురూ అయ్యింది. సూపర్-12 ఓపెనింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదైనా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత ఉత్కంఠ లభించింది. అయితే ఒత్తిడికి చిత్తయిన దక్షిణాఫ్రికా చివరకు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అవుతుండటంతో పరుగులు సులభంగా రాలేదు. దీంతో పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హేజిల్ వుడ్, కమిన్స్ లైన్ అండ్ లెన్త్‌కు కట్టుబడ్డారు. దీంతో నిర్ణీత ఓవర్లలో దక్షిణాఫ్రికా 118/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. మార్‌క్రమ్-40, రబాడ-19, మిల్లర్-16 టాప్ స్కోరర్లుగా నిలిచారు.
Read Also: టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువసార్లు డకౌట్ అయ్యిందెవరో తెలుసా?
అనంతరం 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలో దక్షిణాఫ్రికా బౌలర్లు షాకిచ్చారు. ఫించ్ డకౌట్ కాగా మిచెల్ మార్ష్ 11 పరుగులకే అవుటయ్యాడు. వార్నర్ (14) కూడా ఎక్కువసేపు నిలబడలేదు. అయితే స్మిత్ (35), మ్యాక్స్‌వెల్ (18) కుదురుగా ఆడటంతో ఆస్ట్రేలియా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ వీరిద్దరినీ వెంటవెంటనే ప్రొటీస్ బౌలర్లు అవుట్ చేశారు. చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా స్టాయినీస్ (24 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. వేడ్ 15 పరుగులతో అతడికి సహకారం అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్జేకు రెండు వికెట్లు దక్కగా రబాడ, షాంసీ, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు.