Australia Won Against Sri Lanka in T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. మంగళవారం శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. లంక జట్టు కుదిర్చిన 158 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ జట్టు చేధించింది. తొలుత శ్రీలంక వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్‌కి ఆస్ట్రేలియా మెల్లగా రాణించింది. కానీ, స్టోయినిస్ రంగంలోకి దిగాక స్కోర్ బోర్డు ఒక్కసారిగా తారాజువ్వలా దూసుకెళ్లింది. భారీ షాట్లు బాదుతూ.. లంక బౌలర్లపై తాండవం చేశాడు. అందుకే, మ్యాచ్ త్వరగా ముగిసింది.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, శ్రీలంక బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లలో కుసల్ మెండిస్ (5) ఆరు పరుగుల వద్దే ఔట్ అవ్వడంతో.. నిసాంక (45 బంతుల్లో 40), డీ సిల్వా (26) ఆచితూచి ఆడారు. భారీ షాట్ల జోలికి వెళ్లలేదు. వీళ్లు రెండో వికెట్‌కి 69 భాగస్వామ్యమైతే జోడించారు. అప్పట్నుంచి ఒకవైపు వికెట్లు పడుతూనే, మరోవైపు స్కోరు బోర్డు ముందుకు సాగుతూ వచ్చింది. అసలంక (38) చివర్లో కాస్త మెరుపులు మెరిపించడం, కరుణరత్నే (14) కూడా రెండు ఫోర్లు బాదడంతో.. శ్రీలంక 157 పరుగులు చేయగలిగింది.
ఇక 158 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. లక్ష్యం చిన్నదే కావడంతో మొదట్లో పెద్దగా జోరు చూపించలేదు. డేవిడ్ వార్నర్ (11) ఔట్ అవ్వడంతో.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్) వికెట్లకు అతుక్కుపోయాడు. ఒక్క సిక్స్ మినహాయిస్తే, ఇతర బౌండరీలేమీ బాదలేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23) వచ్చి రాగానే మెరుపులు మెరిపించి, వెంటనే పెవిలియన్ చేరాడు. ఓవైపు ఓవర్లు అవుతున్నా, స్కోరు బోర్డు అంతగా ముందుకు సాగకపోవడంతో.. అతని తర్వాత వచ్చిన స్టోయినిస్ (18 బంతుల్లో 59) విజృంభించాడు. దీంతో.. 21 బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియా గెలిచేసింది.