Vaikuntha Ekadasi Stories: వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు అందరూ విష్ణుమూర్తిని దర్శించుకోడానికి ఆలయాల్లో బారులు తీరుతుంటారు. ఈ రోజున తిరుమలతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రేపే వైకుంఠ ఏకాదశి, మీకు ఈ పురాణ కథలు తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: AP Cabinet: పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏంటి?.. సీఎం చంద్రబాబుకు మంత్రి ప్రశ్న!
రావణుడి బాధలు భరించలేని దేవతలు బ్రహ్మదేవుడిని తీసుకొని వైకుంఠం వెళ్తారు. దేవతలు మార్గశిర శుక్ల ఏకాదశి రోజున శ్రీవారిని ప్రార్థించి, తమ బాధలను విన్నవించుకుంటారు. అప్పుడు మహావిష్ణువు బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇస్తాడు. దేవతల బాధలను పోగొట్టడానికి ఈ ముక్కోటి ఏకాదశే మార్గం చూపిందనే కథ ప్రచారంలో ఉంది. అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మరో కథ కూడా జనాల్లో ప్రచారంలో ఉంది. మహావిష్ణువు మధుకైటభులను సంహరించినప్పుడు, వారు దివ్యరూపాలు ధరించి, దివ్య జ్ఞానాన్ని పొందిన తర్వాత, వారు దేవదేవుడిని ప్రార్థిస్తూ.. ”దేవా! వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశి పూజ గావించి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తరద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కలిగించు” అని ప్రార్థించారు. దానికి మహావిష్ణువు తథాస్తు అని సంతోషంగా అనుగ్రహించారని ప్రచారంలో ఉన్న కథలో ఉంది.
అలాగే మరొక కథలో.. ముక్కోటి దేవతలంతా ఏకాదశి తిథి రోజున శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు వైకుంఠాన్ని చేరుకుంటారని పురాణోక్తి. అందుకే ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి ముక్కోటి ఏకాదశి పేరు అని చెబుతారు. అలాగే వైకుంఠంలోని శ్రీమహావిష్ణువు దర్శనమే ఈ ఏకాదశి రోజున ప్రధాన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరొచ్చిందని పేర్కొంటారు. ముక్కోటి ఏకాదశి రోజున దేవదేవుడు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడనీ ప్రజల విశ్వాసం. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కావడంతో ‘ముక్కోటి ఏకాదశి’ అని దీనికి పేరు. అలాగే వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కాబట్టి ‘వైకుంఠ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు.
READ ALSO: Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి వెనకున్న నమ్మకం ఇదే..