(నేపథ్య గాయకుడు పిఠాపురం జయంతి సందర్భంగా)
తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమ నేపథ్య గానంతో దానికి అదనపు మెరుగులు అద్దినవారు ఎందరో ఉన్నారు. అందులో పిఠాపురం నాగేశ్వరరావు ఒకరు. తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది – పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. కేవలం హీరోహీరోయిన్లకో, ఐటమ్ గీతాలకో, హీరో ఇండ్రక్షన్ సాంగ్స్ కో మ్యూజిక్ ఆల్బమ్ పరిమితమైన పోతున్న ఈ రోజులకు భిన్నంగా సినీ స్వర్ణయుగం సాగింది. అందులో హాస్య పాత్రధారులకూ హాయిని గొల్పే పాటలను రచయితలు రాసేవారు, దర్శకులు చిత్రీకరించే వారు. మరి వారి హావభావాలకు తగ్గట్టుగా పాటలు పాడే గాయనీ గాయకులూ ఎంతోమంది అలనాడు చిత్రసీమలో ఉన్నారు. ఆ కోవలే హాస్య గీతాల గాయనీ గాయకులుగా మాధవపెద్ది – పిఠాపురం పేరు తెచ్చుకున్నారు. 1930 మే 5న పిఠాపురంలో నాగేశ్వరరావు జన్మించారు. వారి ఇంటి పేరు పాతర్లగడ్డ. కానీ ఆయన చిత్రసీమలో మాత్రం పుట్టిన ఊరు ‘పిఠాపురం’ తోనే గుర్తింపు తెచ్చుకున్నారు. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో నటన పట్ల ఆకర్షితులైనా, స్టేజ్ మీద పాడలేని వారికి నేపథ్యం గానం అందించే అలవాటు యుక్తవయసులోనే ఆయనకు అబ్బింది. అదే ఆ తర్వాత ఆయనకు జీవనోపాధిగా మారిపోయింది. 1946లో ‘మంగళసూత్రం’ సినిమాతో ఆయన నేపథ్య గాయకునిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పదహారేళ్ళ ప్రాయంలోనే ‘చంద్రలేఖ’ చిత్రంలో పాట పాడే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వివిధ భాషలలో వేలాది పాటలను పిఠాపురం పాడారు. ఘంటసాలతో కలిసి ‘అవేకళ్ళు’ చిత్రంలో పాడిన ‘మా ఊళ్ళో ఒక పడుచుకుంది’, మాధవపెద్ది తో కలిసి ‘కులగోత్రాలు’ కోసం పాడిన ‘అయ్యయ్యో… జేబులో డబ్బులు పోయెనే’ వంటి పాటలు పిఠాపురానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. వయసు మీద పడిన తర్వాత కూడా పిఠాపురం ఈ సంగీత కచేరీలో పాల్గొన్నా ఈ పాటలను పాడాల్సిందే. తరం మారిన తర్వాత అవకాశాలు సన్నగిల్లాక ఆయన నిదానంగా చిత్రసీమకు దూరమయ్యారు. చివరగా 1978లో ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఓ పాట పాడారు. ఆంధ్ర రఫీ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5న కన్నుమూశారు. అయితే తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం ఆయన సంగీత ప్రియుల గుండెల్లో చిరంజీవి!