Indian States Going Bankrupt: మన దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పీకల్లోతులో అప్పులపాలయ్యాయి. వాటి ఆర్థిక పరిస్థితి.. ముందు ముందు మరింత క్షీణించే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఏమంత గొప్పగా లేదు. ఈ మేరకు ఆర్బీఐ ఇటీవల ఒక కేస్ స్టడీని విడుదల చేసింది. స్టడీలో భాగంగా ఆర్బీఐ రూపొందించిన జాబితాలోని 10 రాష్ట్రాల్లో 5 చోట్ల ఫైనాన్షియల్ కండిషన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. అందువల్ల ఈ రాష్ట్రాలు రానున్న రోజుల్లో మినీ శ్రీలంకలుగా మారతాయా అనేదే అసలు ప్రశ్న.
ఆర్థిక పరిస్థితి బాగలేదంటూ ఆర్బీఐ లిస్టౌట్ చేసిన రాష్ట్రాలు.. బీహార్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. ఈ ఐదు రాష్ట్రాలను ఆర్బీఐ.. ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రాలుగా పేర్కొంది. ఇవి గతంలో చేసిన ఘోరమైన తప్పిదాలను కూడా ఆర్బీఐ పాయింటౌట్ చేసింది. ఈ రాష్ట్రాలు.. సొంత ఆదాయాలు పడిపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభ స్థితిలోకి జారుకుంటోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.
ఒక రాష్ట్ర రుణ నిష్పత్తి వర్సెస్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి సహజంగా 20 శాతం ఉండాలి. కానీ.. గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇది 20 శాతం లోపే ఉంది. పంజాబ్, రాజస్థాన్, బీహార్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో డెట్ పర్సంటేజీ చాలా వరస్ట్‌గా ఉంది. పంజాబ్ రెవెన్యూలో 21 పాయింట్ 3 శాతాన్ని వడ్డీలకే కడుతున్నారు. ఈ రాష్ట్రాల పరిస్థితి ఇంతలా దిగజారటానికి కారణం.. అవి ఇబ్బడిముబ్బడిగా సబ్సిడీలను, ఫ్రీబీస్‌ను అమలు చేస్తుండటమే. అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు ఈ సబ్సిడీలను, ఫ్రీబీస్‌ను అమలుచేయటానికి, తద్వారా ప్రజలను సంతోషపరచటానికి పార్టీ ఫండ్స్‌కు బదులు ప్రభుత్వ ఫండ్స్‌ను వాడుతున్నాయి.
రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో జనాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఉచితాలను అమలుచేస్తుంది. మరోవైపు.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ కొత్త పెన్షన్ స్కీమ్ విషయంలో యూటర్న్ తీసుకున్నాయి. దాని ప్లేసులో మళ్లీ పాత పెన్షన్ స్కీమ్‌నే అమలుచేయాలని నిర్ణయించాయి. రాజస్థాన్ ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్‌ను అమలుచేయాలని నిర్ణయించటం సరికాదని నిపుణులు తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్లే రాజస్థాన్ ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ వైపు మొగ్గుచూపిందనే అభిప్రాయం నెలకొంది. దీనిపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు.. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో సుమారు 22 శాతం పంపిణీ దశలో వేస్ట్ అయిపోతోంది. మన దేశంలో కరెంట్ మీటరింగ్ సిస్టమ్స్ టూమచ్ ఔట్ డేటెడ్. దీంతో కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఢిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగానికి ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయరు.
పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉచితం. అదే రాష్ట్రంలో ప్రతి మహిళకూ నెల నెలా వెయ్యి రూపాయలు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై 15 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ అమ్మఒడి కార్యక్రమం కింద 15 వేల రూపాయలు ఇస్తున్నారు. దానివల్ల ప్రభుత్వంపై 6 వేల 5 95 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది.
యూపీలో ఎన్నికల సందర్భంగా సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆ రాష్ట్ర ప్రజలకు కొన్ని ఉచితాలు ప్రకటించారు. హోలీ సందర్భంగా మూడు ఎల్పీజీ సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని అన్నారు. రైతులు కరెంట్ బిల్లు కట్టాల్సిన పనిలేదని తేల్చేశారు. దీంతో ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటేసి గెలిపించారు. మధ్యప్రదేశ్‌లో రైతులకు మరియు డొమెస్టిక్ యూజర్లకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వటం వల్ల 21 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. ఈ విధంగా కేరళ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్ అమలు చేస్తున్న ఉచిత పథకాలను ఆర్‌బీఐ లిస్టౌట్ చేసింది.
ఇలాంటి పథకాలను ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు అమలు చేస్తున్నాయి. దీనివల్ల స్టేట్స్ ఎకానమీస్ బ్యాక్ సీట్‌లోకి, పాలిటిక్స్ సెంటర్ స్ప్రెడ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఇలాంటి పథకాల అమలుకోసం ప్రభుత్వాలు గ్రాంట్ల మీద గ్రాంట్లు తీసుకుంటూ నిర్లక్ష్యంగా ఖర్చుపెడుతున్నాయని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.