The Gray Man Review : ‘కెప్టెన్ అమెరికా’, ‘అవెంజర్స్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రసో బ్రదర్స్ ఆంటోనీ, జో. వీరి డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది గ్రే మ్యాన్’ జూలై 22 నుండి నెట్ ఫిక్స్ లో భారతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హాలీవుడ్ మూవీలో భారతీయుడైన ధనుష్ కీలక పాత్ర పోషించడం విశేషం. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రూపొందిన ‘ది గ్రే మ్యాన్’ కథా కమామీషు ఏమిటో చూద్దాం.
తండ్రిని చంపిన కేసులో అరెస్ట్ అయిన ఓ వ్యక్తిని సి.ఐ.ఎ.కి చెందిన సీనియర్ ఆఫీసర్ డోనాల్డ్ ఫిట్ర్జో తమ సంస్థ కోసం పనిచేయమని కోరతాడు. జైలు జీవితానికి అంకితమయ్యే కంటే ఇదేదో బాగుందని అతను కూడా అంగీకరిస్తాడు. అతని పాత ఐడెంటిటీని తుడిచి వేసి, ‘సిక్స్’ అనే నామకరణం చేస్తారు. అక్కడ నుండి వివిధ దేశాలు తిరుగుతూ సిఐఏ ఎవరిని చంపమంటే వారిని చంపుతుంటాడు సిక్స్. ఒకరోజు అతను చంపిన వ్యక్తి తనలానే సీఐఏకి పనిచేసే సీకెట్ర్ కిల్లర్ ‘ఫోర్’ అనే విషయం సిక్స్ కు తెలుస్తుంది. కొన్ని రోజులు పోతే తన పరిస్థితి కూడా అదే అని అర్థమౌతుంది. సీఐఏను అడ్డం పెట్టకుని అక్రమాలకు పాల్పడుతున్న లాయిడ్స్ హన్సన్ రహస్యాలు ఉన్న పెన్ డ్రైవ్ ను ఫోర్… చనిపోయే ముందు సిక్స్ కు అందిస్తాడు. అక్కడి నుండి సీఐఏ అధికారులు సిక్స్ ను టార్గెట్ చేస్తారు. అతన్ని వశపర్చుకునే క్రమంలో సీఐఏ మాజీ అధికారులను సైతం హతమార్చుతారు. స్వార్థ ప్రయోజనాల కోసం పొలిటీషియన్స్ కొమ్ము కాసే వ్యక్తులను సీఐఏ గుర్తించి వారి అడ్డు తొలగించిందా? తనను వెంటాడుతున్న సీఐఏ సీక్రెట్ కిల్లర్స్ నుండి సిక్స్ తనను తాను ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ. సిక్స్ నుండి పెన్ డ్రైవ్ ను దొరకబుచ్చుకునేందుకు యత్నించే కిరాయి హంతకుడుగా ధనుష్ నటించాడు. అయితే అతని ఎంట్రీ మూవీ ద్వితీయార్థంలోనే వస్తుంది.
రసో బ్రదర్స్ గతంలో తీసిన సినిమాలతో పోల్చితే ‘ది గ్రే మ్యాన్’ ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. అయితే… స్ట్రయిట్ నెరేషన్ లో కాకుండా, సందర్భానుసారం ఫ్లాష్ బ్యాక్ చెబుతూ ఈ కథను దర్శకుడు ఆసక్తికరంగానే మలిచాడు. సిక్స్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? సీఐఏ అధికారుల పాత పగలకు కారణం ఏమిటనేది మధ్య మధ్యలో చూపడం బాగుంది. తమ్ముడి కోసం సైకో అయిన తండ్రిని హతమార్చిన సిక్స్ గతానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. సీఐఏ ఆఫీసర్ డోనాల్డ్ ఫిట్ర్జో మేనకోడలు క్లారా ను సిక్స్ కాపాడే ఎపిసోడ్ మొత్తం ఆసక్తి కరంగా ఉంది. అలానే సిక్స్ ఒక్కడిని అంతమొదించలేక ఓ వీధి మొత్తాన్ని నాశనం చేసే సన్నివేశం గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఫ్లైట్ ను ధ్వసం చేసి దాంట్లోంచి సిక్స్ దూకేసే సన్నివేశాలు బాగున్నాయి. అలానే సిక్స్ ను డబ్బుల కోసం ఓ కిరాయి మనిషి బంధించిన సన్నివేశం ఫన్నీగా ఉంది. ఇలాంటి సన్నివేశాల కారణంగా సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. బట్.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ధనుష్ పాత్ర లేట్ గా ఎంట్రీ ఇవ్వడం, పదిహేను నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ తో అది పూర్తి కావడం భారతీయ వీక్షకులకు కాస్తంత నిరాశ కలిగించే అంశమే. ధనుష్ కోసం అని కాకుండా ‘ది గ్రే మ్యాన్’ను మామూలుగా చూస్తే నచ్చే ఆస్కారం ఉంది.
సిక్స్ గా రేయాన్ గాస్లింగ్ చక్కటి నటన కనబరిచాడు. బాండ్ సినిమాల్లో హీరోలా తనకంటూ ఓ స్టైల్ ను చూపించాడు. అతనికి సహాయం చేసే మరో సీక్రెట్ ఏజెంట్ డాని మిరాండా గా అనా డి అర్మాస్ బాగా చేసింది. ఇక ప్రతి నాయకుడు లాయిడ్ హన్సన్ గా ‘కెప్టెన్ అమెరికా’ ఫేమ్ క్రిస్ ఇవాన్స్ నటన కట్టిపడేస్తుంది. ఇంత కాలం అయినా అతని ఫేస్ లో ఛార్మ్ తగ్గనే లేదు. ఇతర ప్రధాన పాత్రలను జెస్సికా హెన్విక్, జూలియా బట్టర్స్, బిల్లీ బాబ్ థోర్నటోన్ తదితరులు పోషించారు. హెన్రీ జాక్ మెన్ నేపథ్య సంగీతంతో పాటు స్టీవెన్ కెమెరా పనితనం కూడా చెప్పుదగ్గది. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా రసో బ్రదర్స్ ఈ సినిమాను తీశారు. జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీల్ మూవీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ ను రాశారు. ఈ యాక్షన్ మూవీని తీయడానికి దాదాపు తొమ్మిదేళ్ళ సమయం పట్టింది. లాస్ ఏంజిల్స్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, థాయిలాండ్, క్రొయేషియా, ఆస్ట్రియా, అజర్ బైజాన్‌లలో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. వీకెండ్ లో ‘ది గ్రే మ్యాన్’ చూసి ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్: 2.75 / 5
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ధనుష్ యాక్ట్ చేయడం
ఆకట్టుకునే యాక్షన్ సీన్స్
మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ, కథనాలు
మలుపులూ, మెరుపులు లేకపోవడం
భారీ అంచనాలు ఏర్పడటం
ట్యాగ్ లైన్: యాక్షన్ మ్యాన్!