సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్నాక చేసిన మొదటి సినిమా ‘విరూపాక్ష’. రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకూ వెళ్ళి తిరిగొచ్చిన… తేజు ఈ కథను ఎంచుకోవడం ఓ రకంగా సాహసమనే చెప్పాలి. ఇలాంటి హారర్ థ్రిల్లర్ మూవీని ఇంతవరకూ అతను టచ్ చేయలేదు. అంతేకాదు… హీరోయిన్ సంయుక్త మీనన్ సైతం తన ఇమేజ్ కు భిన్నమైన క్యారెక్టర్ ను ఇందులో చేసింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి సీనియర్ ప్రొడ్యూసర్ బివియస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘విరూపాక్ష’తో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ ఈ కథకు ఎంతవరకూ న్యాయం చేశాడో తెలుసుకుందాం.
ఇది 1979 నాటి కథ. రుద్రవనం అనే పల్లెటూరిలో చిన్నపిల్లలు చనిపోవడానికి వెంకటా చలం (కమల్ కామరాజ్) చేస్తున్న చేతబడి కారణమని నమ్మి… అతడిని, అతని భార్యను చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేస్తారు. వాళ్ళ అబ్బాయి భైరవను ఊరి నుండి వెళ్ళగొడతారు. చనిపోయే ముందు వెంకటాచలం భార్య ‘పుష్కర కాలంలో ఈ ఊరు వల్లకాడు అవుతుంద’ని శపిస్తుంది. అలా పుష్కరం గడిచాక… ఆ ఊరిలో ఉన్న తమ పాత ఇంటిని స్కూలుకు విరాళంగా ఇవ్వడం కోసం సూర్య (సాయిధరమ్ తేజ్) తన పిన్నమ్మతో కలిసి వస్తాడు. ఊరి సర్పంచ్ కూతురు నందిని (సంయుక్త మీనన్)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. సూర్య ఆ పల్లెలోకి అడుగుపెట్టిన తర్వాత ఊరిలో జనం ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఊరికి పట్టిన పీడ విరుగుడు కావాలంటే గ్రామాన్ని అష్టదిగ్భంధనం చేయడమే పరిష్కారమని పూజారి చెబుతాడు. మరి ఈ అష్ట దిగ్బంధనంతో ఊరికి పట్టిన పీడ విరగడయ్యిందా? చిన్నప్పుడే ఊరి నుండి వెళ్ళిపోయిన వెంకటాచలం కొడుకు భైరవ ఏమయ్యాడు? నందిని ప్రేమను దక్కించుకోవడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధమైన సూర్య… ఊరిని వల్లకాడు కాకుండా ఆపగలిగాడా? అనేది మిగతా కథ.
సాయి తేజ్ మూవీస్ అంటే యూత్ ఫుల్ గా, ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఉంటాయి. కానీ ఈ ‘విరూపాక్ష’కు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారంటే… ఎందుకలా? అనే సందేహం కొందరికి కలిగింది. బట్… ఈ సినిమా చూసిన తర్వాత అందులోని మర్మం అర్థమవుతుంది. చేతబడి చేసే మంత్రగాళ్ళను సజీవ దహనం చేయడం అనేది రెండు మూడు దశాబ్దాల క్రితం పల్లెల్లో బాగా జరుగుతుండేది. ఊరికి ఆపద వస్తుందని భావించినప్పుడు గ్రామం మొత్తం ఒక్కటై అలాంటి వారిని దండించిన సంఘటనలు అనేకం. అయితే… అలాంటి ఓ దురదృష్టకర సంఘటనను బేస్ చేసుకుని రివేంజ్ డ్రామాగా కార్తీక్ దండు ‘విరూపాక్ష’ కథను రాసుకున్నాడు. అయితే కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి. అలానే కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గానూ అనిపిస్తాయి. బట్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వాటిని మరిపిస్తుంది.
ఇలాంటి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కు స్క్రీన్ ప్లే తో పాటు టెక్నీషియన్స్ పనితనం కూడా బలాన్ని ఇస్తుంది. అటువంటి సహకారం మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ నుండి ఈ చిత్రానికి లభించింది. సినిమా ప్రారంభం నుండి ఎండ్ కార్డ్ పడే వరకూ గ్రిప్పింగ్ గా స్టోరీ సాగింది. నిడివి కాస్తంత ఎక్కువే ఉన్నా… ‘ఊరికి కీడు చేస్తోంది ఎవరు?’ అనే విషయంలో డైరెక్టర్ మంచి సస్పెన్స్ ను మెయిన్ టైన్ చేశాడు. రకరకాల వ్యక్తులపై అనుమానం కలిగేలా కథను నడిపి, చివరిలో ఊహించని షాక్ కు గురిచేశాడు. అదే చిత్రానికి ఆయువు పట్టు. ఈ విషయంలో స్క్రీన్ ప్లేను అందించిన సుకుమార్ నూ అప్రిషియేట్ చేయాలి. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని నిర్మించారు.
ఆర్టిస్టుల విషయానికి వస్తే… సాయిధరమ్ తేజ్ కు పూర్తి స్థాయిలో మార్కులు పడతాయి. అతని అభినయంలో, వాచకంలో ఎలాంటి వ్యత్యాసం లేదు. యాక్సిడెంట్ ప్రభావం ఎక్కడా తెర మీద కనిపించలేదు. అందుకోసం అతను తెరవెనుక ఎలాంటి కష్టం పడ్డాడో తెలియదు కానీ తన నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో సర్ ప్రైజ్ ఎలిమెంట్ సంయుక్తా మీనన్ యాక్షన్. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇంతవరకూ చేసిన పాత్రలతో వచ్చిన పేరు వేరు. ఈ సినిమా ద్వారా సంపాదించుకునే పేరు వేరు. ఈ పాత్ర పోషణ కోసం చాలా కష్టపడింది. ఆ కష్టం తెర మీద కనిపిస్తోంది. ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, కమల్ కామరాజు, అజయ్, బ్రహ్మాజీ, శ్యామల, ‘అరుంధతి’ అరవింద్, సోనియా సింగ్… అంతా చాలా తమ పాత్రలకు చక్కని న్యాయం చేకూర్చారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆ ఇంటెన్సిటీ చూస్తే ఇటీవల వచ్చిన ‘మసూద’ చిత్రం మదిలో మెదులుతుంది. ఇది రొటీన్ రివేంజ్ డ్రామానే అయినా… డైరెక్టర్ దీన్ని ప్రెజెంట్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. సహజంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కు రిపీట్ ఆడియెన్స్ ఉండరు. కానీ హారర్ జానర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘విరూపాక్ష’నచ్చేస్తుంది!
రేటింగ్: 2.75/ 5
ప్లస్ పాయింట్స్:
ఆర్టిస్టుల నటన
టెక్నీషియన్స్ పనితనం
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ కావడం
సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
మూవీ రన్ టైమ్
ట్యాగ్ లైన్: బ్లాక్ ‘మ్యాజిక్’!