భారతదేశంలోని మేధావులందరూ విదేశాలకు వలసపోతున్నారు. అక్కడకు వెళ్ళినవారు మళ్ళీ తిరిగిరావడం లేదు. ఎందుకని? ఇక్కడి విద్యావిధానమే అందుకు కారణమని చాలామంది చెబుతారు. ఎప్పుడూ విద్యార్థులతో పుస్తకాలను భట్టీయం వేయించి, ఎక్కువ మార్కులు సంపాదించాలన్నదే ఈ నాటి విద్యాసంస్థల లక్ష్యం. నవతరం ఆటపాటలకు దూరంగా జరుగుతోంది. తద్వారా విద్యార్థుల చదువు ఎలా ఉన్నా, అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే పరమావధి కోసమే కదా మనిషి కృషిచేసేది. అందువల్ల విద్యతో పాటు మనిషిని ఆరోగ్యంగా, ఆలోచనాపరునిగా మలిచే కొన్ని కళలనూ అభ్యసించాలని చాటే అంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ రూపొందింది.
‘మ్యూజిక్ స్కూల్’లోకి తొంగిచూస్తే – చదువుమీదే ధ్యాసపెట్టండి, ఇతర కళలను వదిలేయండి అంటూ ఓ స్కూల్ ప్రిన్సిపల్ ఉపన్యాసంతోనే కథ మొదలవుతుంది. ఆ స్కూల్ లోనే డ్రామా టీచర్ గా పనిచేసే మనోజ్ (శర్మాన్ జోషి) ఎలాగైనా పిల్లలతో ఓ నాటకం వేయించి, వారిని కళల పట్ల ఆకర్షితులను చేయాలని తపిస్తుంటాడు. అదే స్కూల్ కు మారియా (శ్రియా శరణ్) వస్తుంది. ఆమె పిల్లలకు సంగీతం నేర్పిస్తే వారి బుద్ధి వికాసం చెందుతుందని ఆశిస్తుంది. దాంతో పాటు చదివే చదువులు వంటపడతాయని నమ్ముతుంది. అయితే అక్కడ చదివే పిల్లల తల్లిదండ్రులు నాటకాలు, సంగీతం అంటూ సాగితే తమ పిల్లలు చెడిపోతారని భావిస్తారు. ఆసక్తిగల పిల్లలను తీసుకొని గోవా వెళతారు. అక్కడ ఓ ప్రేమ జంట తారసపడుతుంది. అందులో అమ్మాయి ఓ పోలీసాఫీసర్ కూతురు. ఆ అమ్మాయి కోసం వెతుకులాట. ఇంట్లోవాళ్ళ నిబంధనలతో పిచ్చివాడైన ఓ పిల్లాడు. వీరందరి చుట్టూ కథ సాగుతుంది. చివరకు మనోజ్, మారియా ఏం చేశారన్నదే మిగిలిన కథ.
‘మ్యూజిక్ స్కూల్’లోని కథాంశంలో సందేశం దాగుంది. ఈ కథతో సినిమా తీయాలని సంకల్పించిన దర్శకనిర్మాత పాపారావు బియ్యాల అభినందనీయులు. పాపారావుకు ఇది తొలి చిత్రమే అయినా, ఎక్కడా అది కనిపించదు. అయితే కథను పాటల నేపథ్యంలోనే నడపాలని ఆయన భావించారు. అందువల్ల దాదాపు పది పాటలను చొప్పించారు. దాంతో నవతరం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్టయింది. ఇళయరాజా బాణీలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం అలరిస్తుంది. అన్నిటినీ మించి శ్రియ అభినయం అగ్రపథాన నిలుస్తుంది. శర్మాన్ జోషి, ప్రకాశ్ రాజ్, ఇతరులు తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రూపొందించారు.
ప్లస్ పాయింట్స్:
– శ్రియ, శర్మాన్ జోషి అభినయం
– ఫ్రెష్ గా అనిపించే కథ
– ప్రొడక్షన్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
– పాటలు ఎక్కువ కావడం, అవి అలరించక పోవడం
– సాగదీసినట్టున్న ద్వితీయార్ధం
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: ఓ కళ(ల)!