ప్రియదర్శి హీరోగా, రూప హీరోయిన్గా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన చిత్రం సారంగపాణి జాతకం. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో రూపొందించబడిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, వైవాహర్ష, తనికెళ్ల భరణి, సీనియర్ నరేష్, వడ్లమాని శ్రీనివాస్ వంటి ఇతర నటీనటులు కీలక పాత్రలలో నటించారు. ఇక ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరచుకుంది. ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ప్రేక్షకులలో ఉన్న ఆసక్తిని ఈ సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకోబోతోంది? సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మన రివ్యూ లో చూద్దాం.
సారంగపాణి కధ:
సారంగపాణి (ప్రియదర్శి) ఒక కార్ షోరూమ్ లో సేల్స్ మాన్ గా పనిచేస్తూ ఉంటాడు. తన షోరూమ్ మేనేజర్ మైధిలి (రూప) అంటే అతనికి ఎంతో ఇష్టం. అయినా, ఆమె తనను ఎక్కడ పట్టించుకుంటుంది అనే ఉద్దేశంతో ఆమెకు ప్రపోజ్ చేయడు. కానీ, అతని మీద అదే ఫీలింగ్స్ ఉన్న మైథిలి మాత్రం లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఇక పెళ్లి అనుకుంటున్న సమయంలో, చేయి చూసి జాతకాలు చెప్పే జిగేస్వరానంద (అవసరాల శ్రీనివాస్) సారంగపాణి ఒక మర్డర్ చేస్తాడని భయపెడతాడు. అయితే, తన పెళ్లయిన తర్వాత మర్డర్ జరిగితే, ఒక హంతకుడి భార్యగా తన మైధిలి ఉండకూడదనే ఉద్దేశంతో, ఎలాగోలా ఒక మర్డర్ చేసేసి పెళ్లి చేసుకుందామనుకుంటాడు. తాను మర్డర్ చేయాలి, కానీ చనిపోయిన వారి వల్ల సమాజానికి గానీ, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తాడు. అలా ఇద్దరు మనుషులను చంపే ప్రయత్నం చేసిన తరువాత, చివరికి అహోబిల రావు(తనికెళ్ల భరణి)ని చంపమని జిగేస్వరానంద సలహా ఇస్తాడు. అందుకు తగిన స్కెచ్ కూడా సిద్ధం చేసి ఇస్తాడు. తన పెళ్లి కోసం అహోబిల రావును చంపేందుకు సిద్ధమైన సారంగపాణి, చివరికి చంపగలిగాడా? లేదా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: సారంగపాణి జాతకం అనే సినిమాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి అనౌన్స్ చేసిన తర్వాత, సినిమా మీద ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు, వరుస ఫ్లాపులలో ఉన్న మోహన్ కృష్ణ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరిలోనూ ఒక ఆసక్తి ఉంది. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఒక రకమైన ఆసక్తి ప్రేక్షకులలో ఏర్పడింది. ఇక ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రాసుకున్నాడు డైరెక్టర్. సినిమా మొదలైనప్పుడే హీరోకి ఉన్న జాతకాల మీద పిచ్చిని సినిమా మొత్తం క్యారీ చేశాడు. ఏదైనా ఒక విషయం మీద నమ్మకం ఉంటే పర్లేదు, అదే మూఢనమ్మకంగా మారితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు సఫలమయ్యాడు. తాను హత్య చేస్తాను అనే భయంతో, ఏదో ఒక విధంగా ముందే ఇబ్బంది లేని హత్య చేయాలని సిద్ధమైన హీరోకి అతని స్నేహితుడు చంద్ర (వెన్నెల కిషోర్) తోడు అవుతాడు. వీరిద్దరూ కలిసి ఆ హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు గడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా, వీరిద్దరి మధ్య రాసుకున్న సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. వీరిద్దరి డైలాగ్ కామెడీ కూడా ఆకట్టుకునేలా ఉంది. అయితే, ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగిన తర్వాత, ఇంటర్ కూడా ఊహకు తగ్గట్టుగానే ఉన్నా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే, సెకండ్ హాఫ్ ఆశించిన మేర బండి నడవడం లేదని ఫీలింగ్ కలుగుతుంది. కానీ, క్లైమాక్స్ పోర్షన్ వచ్చేసరికి సినిమా మళ్లీ నవ్వుల మధ్యలో సాగిపోతూ ఉంటుంది. నవ్వించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ కామెడీతో నవ్వించడం చాలా కష్టమైపోతుంది. అలాంటి పనిని కూడా చాలా సునాయాసంగా డీల్ చేయడంలో మోహన్ కృష్ణ సక్సెస్ అయ్యాడు. అయితే, కొన్ని చోట్ల కామెడీ లాజిక్ లెస్ అనిపిస్తుంది. కానీ, ఇప్పుడున్న సినిమాలు లాజిక్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మ్యాజిక్ చేయగలిగిందా లేదా అనే పాయింట్ తోనే సాగిపోతూ ఉంటాయి. ఆ విషయంలో ఈ సినిమా మంచి మార్కులే వేయించుకుందని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే, సారంగపాణి అనే టైటిల్ లో ప్రియదర్శి విడిపోయాడు. అతనికి ఇలాంటి పాత్రలో ఏమాత్రం కొత్త కాదు. రూప అసలు మేకప్ వేయకుండానే నటించిందేమో అన్నంత సహజంగా కనిపించింది. మిగతా పాత్రధారుల విషయానికి వస్తే, వెన్నెల కిషోర్, వైవాహర్ష, సీనియర్ నరేష్ తో పాటు వడ్లమాని శ్రీనివాస్ కూడా పోటాపోటీగా నటించారు. ముఖ్యంగా, అవసరాల శ్రీనివాస్ కనిపించింది కొన్ని సీన్స్ లోనే అయినా, తన మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక తనికెళ్ల భరణి అనుభవం గురించి చెప్పేదేముంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. అవసరం ఉన్న చోట, లేని చోట లౌడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేస్తూ వస్తున్న ఈ రోజుల్లో, చాలా కంప్లీట్ రానా గోన దానులు లేని సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే, పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు, అది వేరే విషయం. సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి ఫీల్ తీసుకువచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేసిన ఫీలింగ్ అయితే లేదు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. డైలాగ్స్ రాసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలపాల్సిందే. ఒకటి రెండు చోట్ల ఓవర్ ది లైన్ అనిపించినా సరే, చాలా క్లీన్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫైనల్లీ, ఈ సారంగపాణి జాతకం ఒక ఫన్ రైడ్ విత్ క్రైమ్ ఎలిమెంట్స్.