మహానటి సినిమాతో కీర్తి సురేష్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత ఆమె ఎన్ని సినిమాలు చేసినా ఆ ముద్ర మాత్రం పోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె భిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రివాల్వర్ రీటా అనే ఒక డార్క్ కామెడీ సినిమా చేసింది. నిజానికి ఈ సినిమా రెండేళ్ల క్రితమే పూర్తయింది. అప్పట్లో ఓటీటీ రిలీజ్ చేస్తారని అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఈ శుక్రవారం నాడు తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ
రీటా (కీర్తి సురేష్) పాండిచ్చేరిలోని ఒక ఫ్రైడ్ చికెన్ జాయింట్ సెంటర్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె తల్లి (రాధిక) సహా మరో ఇద్దరు అక్కలతో కలిసి ఉంటుంది. ఒక రోజు పెద్ద అక్క కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరపడానికి సిద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా పాండిచ్చేరి డాన్ డ్రాకులా పాండియన్ (సూపర్ సుబ్బారాయన్) వారి ఇంటికి వస్తాడు. అనూహ్యంగా జరిగిన గొడవలో అతను మరణిస్తాడు. అయితే అసలు ఈ డ్రాకులా పాండియన్ వీరి ఇంటికి ఎందుకు వచ్చాడు? అతన్ని చంపడానికి ప్లాన్ చేసింది ఎవరు? ఈ విషయాలన్నీ డ్రాకులా బావమరిది సునీల్కి తెలుసు. తన తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకుంటానని శపథం చేసిన బాబి, ఆ పగ తీర్చుకోగలిగాడా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
తెలుగులో డార్క్ కామెడీ సినిమాలు చాలా తక్కువే, కానీ తమిళంలో మాత్రం అలాంటి సినిమాలు చేసేందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలు సైతం ఆ జానర్ సినిమాలు చేయడానికి ఇష్టపడిన నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా బహుశా అలాంటి సినిమా ఒప్పుకుని ఉండవచ్చు. కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులకు ఎక్కడా కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే కలగదు. దానికి తోడు శివ కార్తికేయన్ డాక్టర్తో పాటు నయనతార కోకో లాంటి సినిమాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ సినిమా రెండేళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా కావడంతో, అది అవుట్ డేట్ అయిపోయిందో లేక ప్రేక్షకులు అప్‌డేట్ అయిపోయారో తెలియదు కానీ, ఈ సినిమా మాత్రం ఏ మాత్రం కొత్తగా అనిపించలేదు. గతంలో చూసిన కొన్ని సినిమాల ఛాయలు ఎక్కువగా కనిపించాయి.
అసలు క్రైమ్ అంటే ఏంటో తెలియకుండా తమ పని తాము చేసుకుపోయే ఒక మధ్య తరగతి కుటుంబం మొత్తం అనుకోకుండా ఒక క్రైమ్‌లో ఇరుక్కుంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఆ క్రైమ్ నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబం అంతా ఏం చేసింది? అనే లైన్ తో ఈ సినిమాని ఆసక్తికరంగా రాసుకున్నారు. కాకపోతే గతంలో వచ్చిన కొన్ని తమిళ్ డార్క్ కామెడీ సినిమాలు కూడా ఇవే లైన్స్ తో వచ్చాయి కాబట్టి, ఈ సినిమా వాటిని కాపీ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఉన్నంతలో దర్శకుడు సినిమాని ఆసక్తికరంగానే నడిపించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే కదా, కాబట్టి కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, రొటీన్ కథ అనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటులు
కీర్తి సురేష్ ఎప్పటిలాగే అదరగొట్టింది. అజయ్ ఘోష్, సునీల్, సూపర్ సుబ్బరాయణ్, రాధిక సహా ఈ సినిమాలో పాత్రలు పోషించిన వారందరూ తమ శక్తి వంచన లేకుండా సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కథ లేకపోవడంతో నటీనటుల నటనతోనే సినిమాని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. అది కొంతవరకు సక్సెస్ అయింది కూడా. అయితే పూర్తిగా నటీనటుల నటన మీదే ఆధారపడడంతో సినిమా బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.
టెక్నికల్ టీమ్
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, కెమెరా వర్క్ బాగుంది. పాటలు పెద్దగా గుర్తించుకునేలా లేవు. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ మీద ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ పనితనం అన్ని ఫ్రేమ్స్‌లోనూ కనిపించింది.
ఫైనల్లీ, రీటా తూటా సరిగా పేలలేదు.