ఆయుష్మాన్ ఖురానా హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం థామా. హిందీలో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన మేడాక్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించడంతో పాటు, సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆసక్తి రేకెత్తించేలా ఉండడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, విజయ్ దేవరకొండ – రష్మిక ఎంగేజ్‌మెంట్ తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా దీపావళి సందర్భంగా 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాని అదే పేరుతో రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
థామా కథ:
అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఒక జర్నలిస్ట్. ఏదైనా వైరల్ వీడియో షూట్ చేద్దామనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి అతను అడవికి ట్రెక్కింగ్ కోసం వెళతాడు. అనుకోకుండా ఎలుగుబంటి దాడి చేయడంతో స్నేహితుల నుంచి వేరుపడిన అతను, బేతాళ జాతికి చెందిన తడక (రష్మిక) కారణంగా బ్రతికి బయటపడతాడు. అతన్ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిన రష్మిక, అతన్ని తన జాతి వారు బలి ఇవ్వడానికి సిద్ధమైన సమయంలో కాపాడుతుంది. అయితే అసలు ఈ బేతాళ జాతి ఏంటి? ఎందుకు అడవిలో ఉంటున్నారు? ప్రేమించుకున్న ఇద్దరు ఒకటయ్యారా, లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ నిర్మాణ సంస్థకి హారర్ ఫిలిమ్స్నిర్మించడంలో మంచి అనుభవం ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన దాదాపు అన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌కు సంబంధించిన కథలు వర్కౌట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా వర్కౌట్ అవుతుందని ఆశతోనే అందరూ ఉన్నారు. కానీ ఈ సినిమా మొదలైన కాసేపటి నుంచే ఇది ఎందుకో ప్రేక్షకులకి మిస్ కనెక్ట్ అయ్యేలా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి రెండు వేరు వేరు కులాలకు లేదా మతాలకు చెందిన వారు ప్రేమించుకోవడం కాన్సెప్ట్ మనం ఎన్నో కథల్లో చూశాం. కానీ ఇక్కడ రెండు వేరు వేరు జాతులకు చెందినవారు, అంటే ఒక మనిషి, ఒక బేతాళ జాతికి చెందినవారు ప్రేమలో పడతారు. వారి ప్రేమ ఎన్ని అనర్థాలకు దారితీసింది, చివరికి వారు ఒకటయ్యారా లేదా, ఈ క్రమంలో ఏమేం జరిగాయి లాంటి విషయాలను ఆసక్తికరంగా చూపించారు. కానీ తెలుగు డబ్బింగ్ విషయంలో మాత్రం ఆ శ్రద్ధ వహించినట్లు అనిపించలేదు. ఎక్కడో ‘ప్రేమమ్’ అనే సినిమాకి హీరోకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్‌తో ఈ సినిమా హీరోకి డబ్బింగ్ చెప్పించారు. అది ప్రధానమైన మైనస్ అనే చెప్పాలి. లైట్ లైట్‌గా సాగిపోతున్న ఇంటర్వెల్ ముందు మాత్రం సెకండ్ హాఫ్‌లో ఏదో చూపించబోతున్నారని ఆసక్తి కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఈ బేతాళ జాతికి చెందిన పూర్తి కథను వివరించే ప్రయత్నం చేశారు. అది వినడానికి ఆసక్తికరంగానే ఉన్నా, ఎందుకో తెరమీద మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని తీసుకురావడంలో తడబడినట్లు అనిపించింది. రొటీన్ అనిపించడం ఒక ఎత్తైతే, ఊహకి అందేలా కథ రాసుకోవడం ఇంకొంత ఇబ్బందికరం. పోనీ పిల్లల కోసం వర్కౌట్ అవుతుందా? అంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే అవసరం లేని స్కిన్ షో ఉంది. మొత్తంగా చూస్తే మన జానపదాల నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న ఈ కథ, కథగా బానే ఉన్నా, తెరకెక్కించడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. తెలుగు డబ్బింగ్ కూడా సినిమాకి మైనస్.
నటీనటులు:
ఇక నటీనటుల విషయానికి వస్తే, రష్మిక బేతాళ యువతిగా జీవించింది. ఆమెకు మంచి పాత్ర పడింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఆకట్టుకున్నాడు. ఇక పరేష్ రావల్ కనిపించిన ప్రతిసారీ నవ్వించాడు. ఇక నవాజుద్దీన్ సిద్ధికి మళ్లీ అదరగొట్టాడు. మిగతా పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ పాత్రలు కూడా బాగున్నాయి.
టెక్నికల్ టీమ్:
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, పాటలు తెలుగులో ఏమాత్రం గుర్తుంచుకునేలా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. డబ్బింగ్ అస్సలు తెలుగులో కామెడీగా ఉంది. కేర్ తీసుకుని ఉండాల్సింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగ్గట్టే ఉంది. గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ:
ఈ థామా… రొటీన్ అటెంప్ట్ విత్ రిచ్ గ్రాఫిక్స్.