NTV Telugu Site icon

Ranga Ranga Vaibhavanga Review: రంగ రంగ వైభ‌వంగా మూవీ రివ్యూ

Ranga Ranga Vaibhavanga Review

Ranga Ranga Vaibhavanga Review

హీరోగా న‌టించిన తొలి చిత్రం `ఉప్పెన‌`తోనే భారీ విజ‌యాన్ని అందుకున్న వైష్ణ‌వ్ తేజ్ ఆ త‌రువాత `కొండ‌పొలం` ఫ‌లితంతో నిరాశ చెందాడు. అప్ప‌టి నుంచీ వైష్ణ‌వ్ ఆశ‌ల‌న్నీ `రంగ‌రంగ వైభ‌వంగా`పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొద‌లైనా, క‌రోనా కార‌ణంగా, ఆ త‌రువాత ప‌లు కార‌ణాల వ‌ల్ల అప్పుడు ఇప్పుడు అంటూ తాత్సారం జ‌రుగుతూనే వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 2న హీరో వైష్ణ‌వ్ తేజ్ మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డేకి `రంగ‌రంగ వైభ‌వంగా` జ‌నం ముందు నిల‌చింది.

`రంగ‌రంగ వైభ‌వంగా` క‌థేమిటంటే- హీరో, హీరోయిన్ ఒకే రోజు, ఒకే స‌మ‌యంలో పుట్టివుంటారు. వారిద్ద‌రి తండ్రులు ప్రాణ‌స్నేహితులు. ఇద్ద‌రూ క‌ల‌సి చ‌దువుకుంటూ ఉంటారు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ, ఓ రోజు స్కూల్ లో జ‌రిగిన సంఘ‌ట‌న వ‌ల్ల వారిద్ద‌రి మ‌ధ్య మాట‌లు ఉండ‌వు. రెండు కుటుంబాలు ఎంతో క‌లివిడిగా ఉన్నా, హీరో,హీరోయిన్ మాట్లాడుకోరు. నిజానికి వారిద్ద‌రికి ఒక‌రంటే ఒకరికి అభిమానం, ప్రేమ ఉంటాయి. రెండు ఇళ్ళ‌లోని వారు ఓ శుభ‌కార్యానికి త‌ర‌లిపోతారు. అయితే హీరో, హీరోయిన్ త‌మ చ‌దువు కార‌ణంగా వెళ్ల‌రు. ఆ స‌మ‌యంలోనే ఒక‌రిపై ఒక‌రికి ఉన్న అనురాగాన్ని తెలుపుకుంటారు. హీరోయిన్ అన్న‌య్య రాజ‌కీయాల్లో రాణించాల‌నుకుంటాడు. ఓ పెద్ద‌మ‌నిషి కొడుకుతో త‌న పెద్ద చెల్లెలుకు వివాహం చేస్తే, రాజ‌కీయంగా త‌న‌కు బాగుంటుంద‌ని హీరోయిన్ అన్న‌య్య భావిస్తాడు. కానీ, ఆ అమ్మాయి హీరో అన్న‌య్య‌ను ప్రేమించాన‌ని చెబుతుంది. దాంతో హీరోయిన్ అన్న‌య్య‌, హీరో అన్న‌ను కొడ‌తాడు. అది తెలుసుకున్న‌హీరో, హీరోయిన్ అన్న‌య్య‌పై చేయి చేసుకుంటాడు. దాంతో రెండు కుటుంబాల మ‌ధ్య దూరం పెరుగుతుంది. హీరోయిన్ అక్క‌, హీరోయిన్ అన్న లేచిపోదామ‌ని చూస్తారు. అయితే వారిని మంద‌లించి, ఆపు చేస్తాడు హీరో. ఆ త‌రువాత హీరోయిన్ అన్న‌కు కూడా రాజ‌కీయంలో ప‌రోక్షంగా సాయ‌ప‌డ‌తాడు. చివ‌ర‌కు హీరో, హీరోయిన్ త‌మ కుటుంబాల‌ను ఎలా క‌లిపారు అన్న‌దే మిగిలిన క‌థ‌.

హీరో, హీరోయిన్ ఒకేరోజు పుట్టార‌ని చెప్ప‌డంతోనే `నువ్వే కావాలి, ఖుషి` వంటి సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ప్ర‌థ‌మార్ధం యువ‌త‌ను ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం, ద్వితీయార్ధంలో ఫ్యామిలీ సెంటిమెంట్ పండించే దిశ‌గా సాగినా, పాత చింత‌కాయ ప‌చ్చ‌డి అనిపించ‌క మాన‌దు. వైష్ణ‌వ్ తేజ్ త‌న ప‌రిధి మేర‌కు న‌టించాడు. కేతిక‌ శ‌ర్మ ముద్దుమోముతో మురిపించింది. ఇత‌ర పాత్ర‌ధారులు త‌మ పాత్ర‌ల‌కు న్యాయంచేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆలీ, స‌త్య కామెడీ కాసింత రిలీఫ్. ద‌ర్శ‌కుడు గిరీశాయ ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు.అయితే అదే క‌థ‌ను న‌వ‌త‌రం ప్రేక్ష‌కులు మెచ్చేలా న‌డిపించే ప్ర‌య‌త్నం చేశారాయ‌న‌. అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుని స‌హ‌నాన్ని ప‌రీక్షించే కొన్ని స‌న్నివేశాలు క‌నిపిస్తాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా “తెలుసా…తెలుసా…“, “కొత్త‌గా లేదేంటి…“ అంటూ సాగే పాట‌లు ఆక‌ట్టుకుంటాయి.

ప్ల‌స్ పాయింట్స్:
– ఆక‌ట్టుకున్న వైష్ణ‌వ్, కేతిక జంట‌
– అల‌రించిన దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం
– నిర్మాణ విలువలు

మైన‌స్ పాయింట్స్:
– క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
– ద్వితీయార్ధం సాగ‌దీసిన‌ట్టుగా ఉండ‌డం
– స‌హ‌నాన్ని ప‌రీక్షించే ప‌లు స‌న్నివేశాలు

రేటింగ్: 2.25/5

ట్యాగ్: రంగ రంగ