సిద్ధార్థ్ మల్హోత్ర, రశ్మికా మందణ్ణ జంటగా నటించిన స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’. పొంగల్ కానుకగా వచ్చిన ‘వారిసు’లో నాయికగా నటించిన రష్మికకు ఈ ఏడాది అప్పుడే ఇది సెకండ్ రిలీజ్. కన్నడిగ అయిన రష్మిక నటించిన తమిళ, హిందీ చిత్రాలు ఇలా బ్యాక్ టూ బ్యాక్ విడుదల కావడం విశేషమే. ‘వారిసు’ థియేట్రికల్ రిలీజ్ కాగా, ‘మిషన్ మజ్ను’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇండియా – పాకిస్థాన్ మధ్య పోటీ అనేది ఇవాళ మొదలైంది కాదు. దేశ విభజన దగ్గర నుండి ఈ రెండు దేశాల మధ్య కనిపించని విద్వేష వాతావరణం నెలకొంది. మన దేశాన్ని అస్థిరపరచడం కోసం పాకిస్థాన్ పన్నుతున్న పన్నాగాలకు అంతే లేదు. దొంగచాటుగా టెర్రిస్టులతో దేశంలోకి పంపుతూ ఏదో రకంగా భారత్ ను దెబ్బతీయాలని పాక్ ప్రయత్నిస్తూనే ఉంది. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో పాకిస్థాన్ కు చావుతప్పి కన్నులొట్ట పోయినా బుద్ధి మాత్రం రావడం లేదు. ఆ ఓటముల నుండి గుణపాఠం నేర్చుకోవడం లేదు.
ఇదిలా ఉంటే… మన దేశాన్ని కాపాడుతోంది కేవలం సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ మాత్రమే కాదు, పాకిస్తాన్ లో ఉన్న ‘రా’ కు సంబంధించిన సీక్రెట్ ఏజెంట్స్ కూడా! అండర్ కవర్ ఆపరేషన్స్ లో పాకిస్థాన్ కు సంబంధించిన ప్రతి అడుగును గుర్తించి, దేశానికి చేరవేసి, పాక్ కుట్రలను భగ్నం చేయడంలో వారి కృషి ఎంతో ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టే అలాంటి కొందరు అండర్ కవర్ ఏజెంట్స్ కథే ‘మిషన్ మజ్ను’. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో భారత్ తొలిసారి ప్రోక్రాన్ లో న్యూక్లియర్ బాంబ్ ను పరీక్షించింది. దాంతో పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టాయి. తాము కూడా ఆటమ్ బాంగ్ ను తయారు చేయాలని అనుకున్నాయి. జనరల్ భుట్టో నేతృత్వంలో అధికారులు ఎ. క్యూ. ఖాన్ అనే సైంటిస్ట్ కు ఆ బాధ్యతను అప్పగించారు. ఇండియా కంటే ముందే మేల్కొన్న ఇజ్రాయిల్ పాకిస్థాన్ లో అణుబాంబు తయారు అవుతున్న స్థావరాన్ని ధ్వంసం చేయాలని చూసింది. కానీ వారికంటే ఆ స్థావరాల విషయంలో పక్కా సమాచారం ఉన్న ఇండియా, ఇజ్రాయిల్ ను ఆ దాడి చేయకుండా నిలువరింప చేసి, ప్రపంచదేశాల ముందు పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టింది. ఈ మిషన్ లో పాక్ లో ఉన్న మన ‘రా’ ఏజెంట్స్ సమాచారాన్ని ఎలా సంపాదించారు? పాక్ కుట్రను ఎలా భగ్నం చేశారన్న దాన్ని డైరెక్టర్ శాంతను భాగ్చీ ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
పాక్ లో దర్జీగా పనిచేసే అమన్ దీప్ సింగ్ అలియాస్ తారీఖ్ గా సిద్ధార్థ్ మల్హోత్ర నటించగా, అతని భార్య నస్రీన్ గా రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. గత యేడాది ద్వితీయార్థంలో వచ్చిన ‘గుడ్ బై’ మూవీలో స్వార్థపరురాలైన కూతురుగా నటించిన రష్మిక ఇందులో చక్కని పాత్రను పోషించింది. అంధురాలైన పాక్ మహిళగా ఆమె చక్కని నటన ప్రదర్శించింది. చిత్రం ఏమంటే… గత యేడాది వచ్చిన ‘సీతారామం’ మూవీలోనూ రష్మిక పాకిస్థాన్ యువతిగానే నటించింది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పర్మీత్ సేథీ, మీర్ సర్వర్, షరీబ్ హష్మి, కుమద్ మిశ్రా, జాకీర్ హుస్సేన్ తదితరులు పోషించారు. పాక్ ప్రధాని భుట్టోగా రజిత్ కపూర్, జియా ఉల్ హుక్ గా అశ్వత్ భట్ నటిస్తే, భారత ప్రధానులు ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ పాత్రలను అవంతిక అకేర్ కర్, అవజిత్ దత్ పోషించారు. కేతన్ సోథ నేపథ్య సంగీతం, బిజితేశ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
‘మిషన్ మజ్ను’ మూవీని చాలా వరకూ దర్శకుడు డాక్యుడ్రామాగా మలిచాడు. దాంతో వ్యూవర్స్ లో ఉత్కంఠ అనేది నెలకొనలేదు. పైగా ఇండో – పాక్ కు మధ్య ఉన్న వైరిభావం నేపథ్యంలో ఈ మధ్య వరుసగా సినిమాలు వస్తున్నాయి. వాటితో పోల్చినప్పుడు దర్శకుడు పూర్తి స్థాయి ప్రతిభను కనబర్చలేదనే చెప్పాలి. థియేటర్లలో కాకుండా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం మంచిదే. దేశం కోసం విదేశాల్లో ప్రాణాలను అర్పిస్తున్న అమర వీరుల గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇదో అవకాశం. విశేషం ఏమంటే… పాకిస్థాన్ లోనూ హిందీ సినిమాల ప్రభావం, ముఖ్యంగా ‘షోలే’ ప్రభావం బాగా ఉన్నట్టు ఓ సన్నివేశంలో చూపించారు. హీరోయిన్ నస్రీన్ తాను ధర్మేంద్ర అభిమానిని అంటూ, ‘షోలే’లోని డైలాగ్స్ చెప్పడం సరదాగా ఉంది.
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
స్పై థ్రిల్లర్ కావడం
ఆర్టిస్టుల నటన
మేకింగ్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
గ్రిప్పింగ్ లేని కథనం
డాక్యూ డ్రామాగా మలచడం
తేలిపోయిన క్లయిమాక్స్
ట్యాగ్ లైన్: పేట్రియాటిక్ డ్రామా!