ఎల్బీ శ్రీరామ్ ‘హార్ట్’ ఫిలిమ్స్’ పతాకంపై ఈ ‘కవిసమ్రాట్’ రూపొందింది. తెలుగుదేశం గర్వించదగ్గ మహాకవుల్లో విశ్వనాథ వారి స్థానం ప్రత్యేకమైనది. తెలుగు సాహిత్యంలోని పలు ప్రక్రియలను తన కలంలో కొత్త పుంతలు తొక్కించిన ఘనులు విశ్వనాథ వారు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కూడా ఆయనే. విశ్వనాథ వారికి ఎందరో శిష్య, ప్రశిష్యులు. ఆయనకు ఏకలవ్య శిష్యులూ బోలెడు మంది. ఇక విశ్వనాథ వారి కవితావైభవం గురించి తెలుగువారికి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన చమక్కులూ ప్రత్యేకమైనవే. ఇవన్నీ తెలుగునాట ఈ నాటికీ విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఆ నోట, ఈ నోట విని అక్షర రూపం దాల్చిన పలు సన్నివేశాల సమాహారమే ఈ ‘కవిసమ్రాట్’.
ఇందులో విశ్వనాథునికి కవిత్వంపై ఉన్న మక్కువతో కథ మొదలవుతుంది. తదుపరి ఆయన ‘రామాయణ కల్పవృక్షం’ పుస్తకం చదువుతున్న వారసుని మదిలో మెదిలేలా విశ్వనాథ వారి జీవిత విశేషాలను చెబుతూ కథను ముందుకు నడిపారు. విశ్వనాథ సత్యనారాయణ వారి పాత్ర పరిచయ ప్రారంభంలో ‘శ్రీహరి స్తోత్రం’ “జగజ్జాల పాలం…” అంటూ నేపథ్యంలో వినిపించడం విశేషం! తన మాతృభాష తెలుగు ఏమైపోతుందో అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ విశ్వనాథవారు రాసుకుంటూ ఉండగా ‘కవిసమ్రాట్’ ముగుస్తుంది.
ఏ బయోపిక్ అయినా, సినిమాలో ఆకట్టుకోవడం కొన్ని కల్పిత సన్నివేశాలను జోడీ చేసుకొనే రూపొందుతుంది. అందుకు ‘కవిసమ్రాట్’ చిత్రమూ మినహాయింపేమీ కాదు. దర్శకుడు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయడం సముచితంగా ఉంది. ఓ సన్నివేశంలో “ఈ విశ్వనాథ నడయాడే గిరిశిఖరం… మూడు గ్రహాల విగ్రహం… అనుగ్రహం- నిగ్రహం- ఆగ్రహం…” వంటి విశ్వనాథుని పదాలను అనువుగా ఉపయోగించడం బాగుంది. “అనుభవమే అక్షరమవుతుంది. ఎంతగొప్పగా అనుభవాలను పోగేసుకోగలిగితే అంత గొప్పగా అక్షరాలని పేర్చగలం…” వంటి సంభాషణలు సాహితీప్రియుల మదిని దోచేస్తాయి. “కష్టం ఎప్పుడు నీ గడప తొక్కినా… ఈ గడపవైపు చూడాలని మరచిపోకు…” వంటి మాటలు హృదయాలను ద్రవింప చేస్తాయి. చివరలో తన తండ్రి విశ్వనాథ గురించి పావని శాస్త్రి మాటలు, చూపిన ఆయన లేఖలు సాహితీ ప్రియులను అలరించక మానవు.
ఎంతోమంది సాహితీప్రియులకు విశ్వనాథ సత్యనారాయణ ఆరాధ్యులు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ సైతం కవిసమ్రాట్టుపై తనకున్న అభిమానాన్ని ఈ సినిమా తీసి తనదైన పంథాలో చాటుకున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందు చిత్రాల్లో కనిపించిన ఎల్బీ శ్రీరామ్, ఇందులో నటించిన వారు ఒక్కరే అంటే అచ్చెరువు కలుగక మానదు. ఆ కవిసమ్రాట్టును మన కళ్ళ ముందు నడయాడేలా చేయడంలో ఎల్బీ శ్రీరామ్ లోని నటుడు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. సందర్భాను సారంగా సాగిన సంభాషణలు, వాటికి తగ్గ రీతిలో సన్నివేశాలను తెరకెక్కించిన సవిత్ చంద్ర ప్రతిభనూ అభినందించకుండా ఉండలేం. ఏది ఏమైనా గంటకుపైగా సాగే ఈ చిత్రం విశ్వనాథునిపై అభిమానం ఉన్నవారినే ఆకట్టుకోగలదు. ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. వ్యాపారాత్మక హంగులేవీ లేని ‘కవిసమ్రాట్’ ఎంతమందిని ఆకర్షించగలదో చెప్పలేం.
ప్లస్ పాయింట్స్:
– సాహితీ మేరునగం కథ కావడం
– ఎల్బీ శ్రీరామ్ అభినయం
– అలరించే సంభాషణలు
మైనస్ పాయింట్స్:
– సాహితీ ప్రియులకు మాత్రమే నచ్చే అంశాలు ఉండడం
– నత్తనడకలా సాగిన కొన్ని సన్నివేశాలు
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: ‘ఆహా’లో ‘హూ హూ’