Atharva Movie Review: తెలుగు సినీ పరిశ్రమ అనగానే లవ్ స్టోరీలు ఎంత కామనో క్రైమ్ థ్రిల్లర్ లేదా హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా అంతే కామన్ గా వస్తుంటాయి.. లవ్ స్టోరీ సంగతి పక్కన పెడితే క్రైమ్ థ్రిల్లర్ లేదా హారర్ థ్రిల్లర్ లను కాస్త లాజికల్గా తెరకెక్కిస్తే అవి కచ్చితంగా వర్కౌట్ అవుతాయన్న నమ్మకం ఇప్పటి మేకర్స్ లో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది అధర్వ అనే సినిమా. క్లూస్ టీం నేపథ్యంలో క్లూస్ టీం లో పనిచేసే ఒక వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కించారు. అసలు ఏమాత్రం క్లూస్ లేక క్లోజ్ చేసిన ఒక కేసును ఓపెన్ చేయించి ఎలా దాని సాల్వ్ చేశారు అనే కోణంలో ఈ సినిమా కథంతా సాగుతుంది. ట్రైలర్ తో సినిమా మీద ఆసక్తి ఏర్పడడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
అధర్వ మూవీ కథ:
తెలంగాణలోని రామకృష్ణాపురం అనే ఊరికి చెందిన దేవ అధర్వ కర్ణ ( కార్తీక్ రాజు)కి చిన్ననాటి నుంచి పోలీసు అవ్వాలనే కోరిక ఉండేది. దానికోసం ఎంత ప్రయత్నించినా ఆస్తమా రోగం వల్ల ప్రతి పరీక్షలోనూ ఫెయిల్ అవుతూ వస్తాడు. క్లూస్ టీం కి ఆస్తమాతో పనిలేదు అనే విషయం తెలిసి అక్కడ ట్రై చేసి ఉద్యోగం సంపాదిస్తాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఒక కేసు ఈజీగా సాల్వ్ చేసి డిపార్ట్మెంట్ దృష్టిలో పడతాడు. అదే సమయంలో తన కాలేజ్ జూనియర్ నిత్య(సిమ్రాన్)రిపోర్టర్గా పనిచేస్తుంటే కాలేజీ రోజుల్లో ఆమెకు చెప్పలేకపోయిన ప్రేమను ఇప్పుడైనా చెప్పి దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆమెకు ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఆమె స్నేహితురాలు, స్టార్ హీరోయిన్ అయిన జోష్ని హుపారికర్(ఐరా), ఆమె ప్రియుడు శివ(శివ) మర్డర్ అవుతారు. అయితే శివనే జోష్నిని మర్డర్ చేసి ఉంటాడని పోలీసులు కేసు క్లోజ్ చేస్తే నిత్య అది నిజం కాదని వారిద్దరి మధ్య అన్యోన్యత ఎలాంటిది అనే విషయాన్ని కర్ణ ముందు ఉంచుతుంది. దీంతో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కర్ణ. అయితే అసలు ఆ ఇద్దరు ఎలా చనిపోయారు? వారు ఎలా చనిపోయారు అనే విషయాన్ని కర్ణ కని పెట్టగలిగాడా? చివరికి ఏం జరిగింది అనేది అధర్వ కథ.
విశ్లేషణ:
ఒక క్రైమ్ జరగడం, ఆ క్రైమ్ అందరూ చూసిన కోణం నుంచి కాకుండా హీరో హీరోయిన్లు మరో కోణం నుంచి చూసి దాన్ని శూలశోధన చేసే ప్రయత్నం చేసిన సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి. వాటిని మనం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటూ ఉంటాం. అధర్వ కూడా అలాంటి కోణానికి సంబంధించిన సినిమానే. నిజానికి ఇప్పటివరకు మనం ఎంతో మంది పోలీసులు, సిఐడి అధికారులు లేదా సిబిఐ అధికారులు సాల్వ్ చేసిన కేసులు చూశాం .కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంతవరకు తెలుగులో క్లూస్ టీం స్టాఫ్ కూడా కేసులు సాల్వ్ చేసే విషయంలో చాలా కీలకమని చెబుతూ చేసిన సినిమా ఇది. సినిమా మొదటి భాగం నుంచి కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ఎప్పుడైతే హీరోకి మొదటి కేసు వస్తుందా అప్పటి నుంచి కాస్త వేగం అందుకుంటుంది. హీరోయిన్ హత్య ఆ తరువాత ఆ కేసు తీసుకోవాలని హీరో భావించడం లాంటి విషయాలతో సినిమా సెకండ్ హాఫ్ అంత ఆసక్తికరంగా సాగుతుంది. అంతా బాగానే ఉంటుంది కానీ జంట హత్యలు జరగడం, ఆ తర్వాత ప్రియుడిగా హత్య చేసి ఉంటాడని పోలీసులు కేసు మూసేసిన క్లూస్ టీంలో పనిచేసే హీరోకి తన ప్రేయసి చెప్పేవరకు అనుమానం రాకపోవడం కాస్త వాస్తవ దూరంగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత దాదాపుగా అంతా లాజికల్ గా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు.
నటీనటుల విషయానికి వస్తే కర్ణ అనే పాత్రకి కార్తీక్ రాజు బాగా సెట్ అయ్యాడు. క్లూస్ టీం ఎంప్లాయ్ గా పోలీస్ అవ్వాలని కలలుగానే వ్యక్తిగా ఒదిగిపోయాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హీరోయిజం ఎలివేట్ చేసేందుకు ఫైట్లు ఎక్కువగా లేకపోవడం. ఇక హీరోయిన్ సిమ్రాన్ చౌదరి పాత్ర అవసరం లేదు అనిపించేలా ఉన్నా ఉన్నంతలో ఆమె మెప్పించింది. ఐరా కూడా తన పరిధి మేరకు బాగానే నటించింది. మిగిలిన పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే హేమాహేమీలు అందరూ తమ తమ అనుభవాన్ని అంతా సినిమా కోసం రంగరించినట్టు అనిపించింది. శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పెద్దగా గుర్తించుకో తగినట్టు లేవు, కేసిపిడి సాంగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా సెట్ అయింది. డైలాగ్స్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా కొత్త నిర్మాత తెరకెక్కించినట్టు అనిపించలేదు.
ఫైనల్ గా చెప్పాలంటే అధర్వ అనేది థ్రిల్ మిస్సయిన ఒక తెలివైన పోలీసోడి లైఫ్ లోని ఒక కేసు, సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్!