గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా జూనియర్ అనే సినిమా రూపొందింది. వారాహి చలనచిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మించగా, కర్ణాటకలో ఇప్పటికే ఒక సినిమా డైరెక్ట్ చేసిన రాధాకృష్ణ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. శ్రీ లీలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జెనీలియా చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడంతో పాటు ట్రైలర్ కట్ కూడా ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమా మీద అందరి ఫోకస్ పడింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.
జూనియర్ కథ: అభి (కిరీటి) కోదండపాణి (రవిచంద్రన్) దంపతులకు చాలా ఆలస్యంగా పుట్టిన బిడ్డ. పుట్టినప్పుడే తల్లిని కోల్పోవడంతో అభిని కోదండపాణి చాలా అల్లారుముద్దుగా పెంచుతాడు. అయితే తనకు తండ్రికి ఏజ్ గ్యాప్ కాదు, జనరేషన్ గ్యాప్ ఉందనే ఫీలింగ్‌లో ఉండే అభి, తండ్రి ప్రేమను సఫొకేషన్‌గా ఫీల్ అవుతాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. కాలేజీ పూర్తయి ఉద్యోగానికి వెళ్దాం అనే సమయానికి తండ్రి మళ్లీ సిటీకి షిఫ్ట్ అవుతాడు. తండ్రికి దూరంగా ఉండాలంటే ఉద్యోగం చేయాలని ఉద్దేశంతో విజయ సౌజన్య (జెనీలియా) కంపెనీలో జాయిన్ అవుతాడు. మొదటి రోజే ఆమెతో చిన్నపాటి గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా ఏకంగా ఆమె సీఈఓ కాకుండా అడ్డుకుంటాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. విజయ సౌజన్య గురించి అభికి తెలిసిన షాకింగ్ విషయం ఏమిటి? విజయ సౌజన్య తండ్రి రావు రమేష్ అభికి ఏమవుతాడు? అభి తండ్రి కోదండపాణికి, రావు రమేష్‌కి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: కథపరంగా చూస్తే ఇదేదో కొత్తగా ఇప్పటి ప్రేక్షకుల కోసం రాసుకున్న కథ అని అనలేం, ఎందుకంటే ఈ తరహా కథలు మనం ఎప్పుడో ఎన్నో చూసే ఉంటాం. అయితే ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా రాసుకోవడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలా అని అద్భుతం అనలేము కానీ, ఉన్నంతలో ఒకపక్క కామెడీతో, మరోపక్క ఎమోషన్స్‌తో సినిమాని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. మొదలైనప్పుడే అభి పుట్టుక నుంచి అతని కాలేజీ లైఫ్, ఆ తర్వాత తండ్రి నుంచి దూరంగా పారిపోవడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా చూపిస్తారు. ఎప్పుడైతే సినిమా కథలోకి జెనీలియా ఎంట్రీ ఇస్తుందో, అప్పుడు కథలో వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత జెనీలియాకి, హీరోకి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ఆ గొడవలు చినుకు చినుకుగా గాలివానలా మారి వారి మధ్య దూరం పెరగడం, ఆ తర్వాత ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ఇంటర్‌వెల్ బ్లాక్ రాసుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ తర్వాత కథ ఊహకు తగ్గట్టుగానే నడుస్తూ ఉండడం కాస్త మైనస్ అయ్యే అంశం. అలాగే శ్రీలీల పాత్రను హీరోయిన్‌గా రాసుకున్నారు కానీ, వారిద్దరి మధ్య పెద్దగా కెమిస్ట్రీ వర్కౌట్ చేసే ప్రయత్నం చేయలేదు. కేవలం శ్రీలీలను ప్యాడింగ్ కోసమే తీసుకున్నారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే శ్రీలీల లేకపోవడం ఎంత మైనస్ పాయింట్ అంతే ప్లస్ పాయింట్ కూడా అని చెప్పొచ్చు, ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో అనవసరమైన డివియేషన్ తీసుకోకుండా పూర్తిగా తాను చెప్పాలనుకున్న పాయింట్‌ని దర్శకుడు కన్వే చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే శ్రీలీల పాత్రకి సరైన క్లోజర్ ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా కథ ఎప్పటినుంచో చూస్తున్న ఫీలింగ్ కలిగినా సరే, కిరీటి తనదైన పర్ఫామెన్స్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో వన్ మ్యాన్ షో చేసినట్లే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. నిజానికి ఈ సినిమా మీద ఎవరికి అంచనాల లేవు. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడంతో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తితో అందరూ దియేటర్లలో అడుగుపెట్టారు కానీ కిరీటి మాత్రం తనదైన శైలిలో సినిమాని నడిపించాడు. ఒకపక్క ఎమోషన్స్ పండిస్తూనే మరోపక్క లైట్ హార్టెడ్ కామెడీ చేయాల్సిన సీన్స్ లో అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడు.
నటీనటులు: నటీనటుల విషయానికి వస్తే, ఇది కిరీటికి మొదటి సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. నటనలో కానీ, డాన్స్‌లో కానీ, ఫైట్స్‌లో కానీ చాలా ఈజీగా అనుభవం ఉన్నవాడిలా కనిపించాడు. మరీ ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ డాన్స్‌తో పాటు మరో రెండు సాంగ్స్‌లో కూడా ఇరగదీశాడు. ఇక ఫైట్స్ కూడా చేసిన తీరు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. శ్రీలీల పాత్ర పరిమితమే. జెనీలియా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక రవిచంద్రన్‌కు చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. రావు రమేష్ ఎప్పటిలాగే ఉన్నంతలో మెప్పించాడు. ఇక సత్య వైవాహిక ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. ఇక సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాని రిచ్‌గా ప్రెజెంట్ చేసే ఫీల్ తీసుకురావడంలో సెంథిల్ విజువల్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయింది. సినిమా నిడివి కూడా సాగదీయకుండా చాలా క్రిస్పీగా కట్ చేసుకోవడంలో ఎడిటర్ పనితనం బయటకు వచ్చింది. కొన్ని చోట్ల ఊహకు అందేలా సీన్స్ ఉండడం, ప్రొడక్షన్ కథ విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి.
ఫైనల్లీ: ఈ జూనియర్ కిరీటికి పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్.