సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జీవి ప్రకాష్ కుమార్ తొలుత సంగీత దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టాడు. తర్వాత నెమ్మదిగా నటుడుగా మారిన ఆయన ఇప్పుడు ఏకంగా హీరోగా 25వ సినిమాకి వచ్చేసాడు. ఒకపక్క సంగీత దర్శకుడిగా 100 సినిమాలు హీరోగా పాతిక సినిమాలో చేస్తూ తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మనోడు చేస్తున్న కొన్ని సినిమాలు తెలుగులో కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే తానే నిర్మాతగా మారి చేసిన కింగ్స్టన్ అనే సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశాడు. ఇండియాలోనే మొట్టమొదటి సీ హారర్ చిత్రంగా అభివర్ణిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి ఏడవ తేదీన తెలుగులో రిలీజ్ చేశారు. అయితే ఒకరోజు ముందుగానే మీడియాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కింగ్స్టన్ కథ:
ఇదంతా తమిళనాడులోని ఒక తీర ప్రాంతంలో జరిగే కథ.. కొన్ని కారణాలతో ఒక ఊరు ప్రజలందరూ సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. ఆ ఊరి వాళ్ళు ఎవరు వేటకు వెళ్ళినా శవాలతోనే తిరిగి వస్తూ ఉండడంతో ఆ ఊరి సముద్రాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. అయితే అదే ఊరికి చెందిన కింగ్స్టన్ (జీవి ప్రకాష్ కుమార్) ఎప్పటికైనా తమ ఊరి సముద్రంలోకి వేటకు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అందుకు తనకు సొంత పడవ కావాలని, ఆ పడవ కొనుక్కునేందుకు డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. డబ్బు కోసం ఏదైనా చేయొచ్చని భావించి ఇల్లీగల్ వ్యవహారాలు నడిపే థామస్(సాబుమన్) దగ్గర పని చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అనూహ్యంగా థామస్ కే ఎదురు తిరిగి, తన ఊరి వారందరికీ సముద్రంలో ఎలాంటి దయ్యాలు లేవు అని చెప్పేందుకు బోట్ తీసుకుని తన స్నేహితులతో సముద్రంలోకి వెళ్తాడు. అలా వెళ్లిన కింగ్స్టన్ కి ఏమైంది? అసలు సముద్రంలో దయ్యాలు ఉన్నాయా? లేక అదంతా ఒట్టి కట్టు కథఏనా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనా?
విశ్లేషణ:
ఇది ఓ సీ అడ్వెంచర్ సినిమా అని ముందు నుంచే ప్రచారం చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. దానికి తగ్గట్టే ఓ మత్స్యకార గ్రామంలో జరిగే కథగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో దయ్యాల కథలు వింటూనే ఉంటాం. అలాంటి విన్న ఒక కథను సినిమాగా చేస్తే అనే ఆలోచన రావడంతోనే దర్శకుడు ఇలాంటి కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. నిజానికి సినిమా ప్రారంభమైనప్పుడు వచ్చే సన్నివేశాలు భయం గొలిపేలా ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఆఫ్ అంతా ఎందుకో కథ అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో కథలో వేగం పెరగడంతో పాటు ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. అయితే ఆ దయ్యం కథ రొటీన్ కానీ దాన్ని కన్ఫ్యూజింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కాస్త ఇబ్బందికర అంశం. ఎందుకంటే మనం ఇప్పటికే కొన్ని వందల దయ్యాల కథలు సినిమాలుగా చూసాం. ఇక్కడ ఏమైనా కొత్తదనం ఉంటుందేమో అనుకుంటే వీటిని మగ డయ్యాలుగా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఒక దెయ్యం అని చెప్పి తర్వాత రెండు దయ్యాలుగా మార్చి కాదు తర్వాత మళ్లీ ఒకటే దెయ్యం అంటూ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే అలా చేయకుండా కథలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఈ సినిమా టెక్నికల్ గా మాత్రం అత్యద్భుతంగా తీసుకు రావడంలో దర్శకుడితో పాటు నిర్మాత జీవి ప్రకాష్ కుమార్ సక్సెస్ అయ్యాడు. కొన్నిచోట్ల వెన్నులో వణుకు పుట్టించేలా భయపెట్టడంలో టీం సక్సెస్ అయింది. అలాగే ఇప్పటివరకు అడవులలో లేదా పాడుబడిన బంగ్లాలలో మాత్రమే కనిపిస్తూ వచ్చిన దయ్యం ఇప్పుడు ఒక సముద్రంలో ఆ సముద్ర గర్భాన్ని మొత్తం ఆక్రమించి అటువైపు ఏ పడవ, లాంచి వచ్చిన అందులో వాళ్లను చంపేస్తుంటే ఎలా ఉంటుంది? అయితే అసలు ఆ దయ్యాలే లేవని నిరూపించడానికి సిద్ధమైన ఆ ఊరికి చెందిన కింగ్స్టన్ అనే యువకుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? అనే విషయాలను ఆసక్తికరంగా చూపించాడు. సినిమాలోని ఎన్నో లేయర్స్ టచ్ చేయకుండా చెప్పాలనుకున్న కథ సూటిగా చెప్పి ఉంటే ఇంకా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి ఉండేది. కానీ ఓవరాల్ గా ఒక సి అడ్వెంచర్ సినిమా, అది కూడా హారర్ ఎలిమెంట్స్ తో ఉండాలంటే ఇలా ఉండాలి అనేలా ఇది ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు అయినా నటుడిగా కూడా తనకు తాను ప్రూవ్ చేస్తున్నాడు. ఇది హీరోగా అతనికి 25వ సినిమా ఈ సినిమాలో పాత్ర కూడా చాలా ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. ఇలాంటి పాత్రలు మన వాడికి కొట్టిన పిండే. ఇక దివ్యభారతి నుంచి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు నిరాశ పడతారు. ఎందుకంటే ఈ సినిమాలో గ్లామర్ తో కాకుండా నటనతో మెప్పించే ప్రయత్నం చేసి కొంత వరకు సక్సెస్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు, తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా సరే వాళ్లు తమిళ సినిమాలలో వారిని చూసిన ఫీలింగ్ ఉంటుంది. వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ గురించి ప్రథమంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే భయపెట్టి విజువల్స్ తీసి వణుకు పుట్టించడంలో సక్సెస్ అయ్యాడు. తర్వాత స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పనితనం కూడా ఫైట్స్ లో కనిపించింది. నిజానికి జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంటాయి. సినిమా మొదలైన కొత్తలో ఎందుకు ఇంత లౌడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అని అనిపించినా నెమ్మదిగా ఆ వరల్డ్ లోకి తీసుకువెళ్లడంలో ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యపాత్ర పోషించింది. ఇక తెలుగు డబ్బింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. నిడివి విషయంలో మరింత కేర్ తీసుకుని ఉండే బాగుండేది.
ఫైనల్లీ కింగ్స్టన్ ..హారర్ థ్రిల్లర్ లవర్స్ కి ఫీస్ట్.. కానీ కండిషన్స్ అప్లై..