Doctor G movie review: ఇమేజ్ చట్రంలో ఇరుకున్న నటీనటులు అందులోంచి బయట పడటం అంత తేలిక కాదు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఏ ముహూర్తాన ‘విక్కీ డోనర్’లో అతను నటించాడో కానీ ఆ తరహా కథలన్నీ అతని దగ్గరకే పోతున్నాయి. వాటిల్లోంచి మేటి కథలను ఎంపిక చేసుకోవడంలో ఒక్కోసారి ఆయుష్మాన్ ఖురానా సైతం తడబడుతున్నాడు. బట్… అతని లేటెస్ట్ మూవీ ‘డాక్టర్ జీ’ మాత్రం అందుకు భిన్నమైంది. ఆయుష్మాన్ ఇమేజ్ ను ఎలివేట్ చేస్తూనే, ఓ చక్కని సోషల్ మెసేజ్ ను ఈ మూవీ అందించింది.
సహజంగా మిడిల్ క్లాస్ లేడీస్ లో బెరుకు ఎక్కువ ఉంటుంది. ఏదైనా లైంగిక పరమైన సమస్యతో హాస్పిటిల్ కు వెళ్ళినప్పుడు లేడీ డాక్టర్ ఉంటేనే ఓపెన్ అవుతారు, తమ సమస్యను గురించి వివరిస్తారు. ఇదే సమస్య మగవాళ్ళలోనూ ఉంటుంది. ఎదురుగా కూర్చున్నది లేడీ డాక్టర్ అయితే వాళ్ళ నోరు పెగలదు. సో… డాక్టర్లు లింగ వివక్షతకు తావు ఇవ్వకపోయినా, పేషెంట్స్ లో మాత్రం ఆ న్యూనతా భావం ఉంటుంది. ఇదే రకమైన మనస్తత్త్వం ఓ డాక్టర్ లోనే ఉంటే పరిస్థితి ఏమిటీ? అనేదే ‘డాక్టర్ జి’ సినిమా. భోపాల్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గైనకాలజీ డిపార్ట్ మెంట్ లో జరిగే కథ ఇది. వైద్య విద్యార్థి ఉదయ్ గుప్తా (ఆయుష్మాన్ ఖురానా) కు ఆర్థోపెడిక్ డిపార్ట్ మెంట్లో చేరాలని ఉంటుంది. కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో గైనకాలజీలో చేరతాడు. అక్కడ నుండి అతనికి కష్టాలు షురూ అవుతాయి. ఆ క్లాస్ లో అందరూ లేడీస్ కాగా అతనొకడే జెంట్. ఇక ఆడవాళ్ళ డామినేషన్ మగవాళ్ళు ఎలా ర్యాగింగ్ కు గురౌతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం ఆసక్తి, అనురక్తి లేని గైనకాలజీ డిపార్ట్ మెంట్ నుండి ఉదయ్ గుప్తా ఎప్పుడెప్పుడు బయట పడదామా అని చూస్తుంటాడు. కానీ అతను చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. దానికి తోడు సూపర్ వైజర్ నందిని (షెఫాలీ షా) రూపంలో ఎదురయ్యే సమస్యలు వాటికి జత అవుతాయి. అతని వాలకం చూసి ప్రియరాలు విడిచిపోతుంది. కాలేజీ మేట్ ఫాతిమా (రకుల్ ప్రీత్ సింగ్) సైతం అతన్ని ఓ పిల్లాడిలానే ట్రీట్ చేస్తుంటుంది. ఇక ఇంట్లో తల్లి… ఈ జనరేషన్ మదర్ లా ప్రవర్తిస్తుంది. ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉన్న లేడీస్ మధ్య ఈ కుర్ర డాక్టర్ ఎలాంటి కష్టాలు పడ్డాడన్న దాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించింది అనుభూతి కశ్యప్. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోదరి అయిన అనుభూతికి ఇదే మొదటి ఫీచర్ ఫిల్మ్. అందువల్లే కావచ్చు… ఫస్ట్ మూవీలోనే తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేసింది.
దర్శకురాలు అనుభూతి ఇంటెలిజెంట్ గా రెండు అంశాలను ఈ కథలో చొప్పించింది. జండర్ ఈక్వాలిటీ ఒకటి కాగా అండర్ ఏజ్ ప్రెగ్నెస్నీ, టీనేజ్ ప్రెగ్నేన్సీ మరొకటి. జండర్ డిస్క్రిమినేషన్ ను కామెడీతో డీల్ చేసిన ఆమె, ఆ తర్వాత అంశమైన అండర్ ఏజ్ ప్రెగ్నెస్నీని ఫుల్ డ్రామాతో రన్ చేసింది. దాంతో ఈ సినిమాను పూర్తిగా కామెడీ కేటగిరిలో వేయలేం. అలా అని వినోదానికి పెద్ద పీట వేయలేదని కాదు! మెడికో గానే కాదు, ఆ తర్వాత హాస్పిటల్ లో ప్రెగ్నెంట్ లేడీస్ ను ట్రీట్ చేసే సమయంలోనూ డాక్టర్ ఉదయ్ గుప్తా పడే పాట్లు చూస్తే బోలెడంత నవ్వు వస్తుంది. ఫస్ట్ అటెమ్ట్ లోనే దర్శకురాలు అనుభూతి మంచి మార్కులే పొంది, బాక్సాఫీస్ దగ్గర పాసై పోయింది.
నటీనటుల విషయానికి వస్తే ఆయుష్మాన్ ఖురానాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం నల్లేరు మీద బండి నడక. కానీ ఇలాంటి పాత్రలే చేస్తూ పోతే మాత్రం ఆడియెన్సే కాదు అతని అభిమానుల సైతం మొనాటనీ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇందులోని కొన్ని సన్నివేశాలను, అలానే ఆయుష్మాన్ ఖురానా నటనను చూస్తే మనకు ‘బదాయ్ హో, చండీఘర్ కరే ఆషికీ, విక్కీ డోనర్’ వంటి సినిమాలు మదిలో మెదులుతాయి. ఫాతిమాగా రకుల్ చక్కని నటన కనబరించింది. ఆ పాత్రను హుషారుగా చేసింది. కానీ ఆమె క్యారెక్టర్ ను ఇంకాస్తంత బెటర్ గా రాసి ఉంటే బాగుండేది. షెఫాలీ షా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ‘సత్య’ మూవీ నుండి ఆమెను చూస్తున్నాం. బలమైన పాత్ర లభించాలే కానీ షెఫాలీ అద్భుతంగా నటిస్తుంది. ఇందులోనూ తనదైన ముద్రను నందినీ పాత్రపై వేసింది. ముఖ్యంగా ‘మేల్ టచ్’ ను వదులుకోమంటూ డాక్టర్ ఉదయ్ గుప్తాకు క్లాస్ తీసుకునే సీన్ సూపర్. హీరో తల్లి పాత్ర పోషించిన షీబా చద్దా ఆడియెన్స్ కు బోలెడంత రిలీఫ్ ను ఇచ్చింది. ఆమె తెర మీదకు వస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వుల పువ్వులు పూస్తున్నాయి. కంటెంట్ పరంగానే అయినా… కొన్ని చోట్ల సంభాషణలు హద్దులు మీరాయి. వాటిని ఇంకాస్తంత బెటర్ గా రాసి ఉంటే బాగుండేది. ఇప్పటికీ మహిళలు మేల్ డాక్టర్స్ దగ్గర తమ సమస్యలు చెప్పడానికి వెనకడుగు వేసినట్టుగానే… ఇప్పటికీ కొందరు ప్రేక్షకులు ఇలాంటి కథలను, సంభాషణలు యాక్సెప్ట్ చేయడానికి తటపటాయిస్తూనే ఉన్నారు. ఆ రకంగా చూసినప్పుడు ‘డాక్టర్ జీ’ కొన్ని వర్గాలనే మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
ఆయుష్మాన్ ఖురానా నటన
ఇచ్చిన సందేశం
మైనెస్ పాయింట్స్
స్టీరియో టైమ్ కామెడీ
హీరోయిన్ క్యారెక్టరైజేషన్
సెకండ్ హాఫ్ ఓవర్ డ్రామా
ట్యాగ్ లైన్: కామెడీ డాక్టర్!