రోషన్ మేకా హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఛాంపియన్’ సినిమాను తెరకెక్కించారు. మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని, తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించారు. ప్రమోషన్స్‌ని గట్టిగా చేసింది సినిమా యూనిట్; ఈ నేపథ్యంలో సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఛాంపియన్ కథ:
సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేస్తూ ఉండే మైఖేల్ (రోషన్), ఎప్పటికైనా ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. దానికి ఫుట్‌బాల్ సరైన దారి అని భావించి, ఫుట్‌బాల్‌లో ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తూ ఉంటాడు. అయితే ఇంగ్లాండ్ వెళ్లడానికి అవకాశం వచ్చిన ఒక తరుణంలో, అతని తండ్రి చేసిన పని అతనికి అడ్డంకిగా మారుతుంది. అయితే అతను ఇంగ్లాండ్ వెళ్లాలంటే, ఒకచోట తుపాకులు డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో అనుకోకుండా అతను దారితప్పి తుపాకులు ఉన్న ట్రక్కుతో పాటు బైరాన్‌పల్లి గ్రామానికి చేరుతాడు. అతను ఆ తుపాకులను డెలివరీ చేసి ఇంగ్లాండ్ చేరుకున్నాడా? ఇంగ్లాండ్ చేరుకోవడానికి అడ్డంకిగా మారిన అతని తండ్రి చేసిన పని ఏమిటి? అసలు బైరాన్‌పల్లి గ్రామానికి వెళ్ళిన తర్వాత మైకేల్ ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
తెలంగాణలోని బైరాన్‌పల్లి నేపథ్యంలో ‘ఛాంపియన్’ సినిమా రూపొందిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి సినిమా ఎలా ఉంటుంది అనే అంచనాలు అందరిలో ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్‌లో చేయడంతో పాటు కొన్ని పాటలు వర్కవుట్ కావడంతో సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా ప్రారంభమంతా కాసేపు నిజాం గురించి, రజాకార్ల గురించి క్లుప్తంగా వివరించి, తర్వాత మైకేల్ పాత్రను పరిచయం చేశారు.
అతను ఇంగ్లాండ్ వెళ్లడం కోసం చేసే ప్రయత్నం చూపిస్తూ, నెమ్మదిగా అతని ప్రయాణాన్ని బైరాన్‌పల్లి గ్రామానికి మళ్ళించిన గమనం బాగుంది. అయితే ఫస్టాఫ్ అంతా అక్కడక్కడే తిరుగుతూ ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే బైరాన్‌పల్లి మీద రజాకార్ల ఎటాక్ జరుగుతుందో, అక్కడ ఇంటర్వెల్ ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తి పెంచేశారు. సెకండాఫ్ మొదలయ్యాక కూడా చాలా సేపు బైరాన్‌పల్లి నేపథ్యంలోనే జరుగుతున్న కథ కొంచెం ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది; కానీ మళ్లీ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా హై మూమెంట్స్ ఉన్నాయి.
ప్రేక్షకులకు ల్యాగ్ ఫీలింగ్ కలిగించినా సరే, ఎంగేజ్ చేయడంలో ప్రదీప్ అద్వైతం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎక్కడా డివియేట్ కాకుండానే మనల్ని కూడా ఆ బైరాన్‌పల్లిలోకి తీసుకువెళ్లి, అక్కడ జరుగుతున్న కథను చూపించిన ఫీలింగ్ కలిగించారు. నిజానికి ఇలాంటి సినిమాలు రాసుకున్నంత ఈజీగా తెరకెక్కించలేం; కానీ ఆ విషయంలో ‘స్వప్న సినిమా’ వేసిన ముందడుగును అభినందించాల్సిందే. వాస్తవానికి పీరియాడిక్ నేపథ్యంలో స్వాతంత్ర ఉద్యమాలను లింక్ చేస్తూ రాసుకున్న చాలా సినిమాలు ఉన్నాయి, కానీ రజాకార్ల నేపథ్యంలో మాత్రం చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాను చాలా పకడ్బందీగా రాసుకున్న తీరు, దాన్ని అంతే పకడ్బందీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తీరు బాగుంది.
నటీనటులు & సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, మైకేల్ అనే టైటిల్ రోల్‌లో రోషన్ పరకాయ ప్రవేశం చేశాడు. పూర్తిస్థాయి తెలంగాణ యాస మాట్లాడుతూ, అప్పటి తెలంగాణ కుర్రాడిగా సీన్స్‌లో మెరిశాడు. ఇక సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అనస్వర రాజన్ తో పాటు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. అనస్వర రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు రోషన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇక స్క్రీన్ మీద నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కనిపించిన ప్రతిసారి ఒక మంచి నటుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో నటించిన రచ్చ రవి, ‘బలగం’ సంజయ్ సహా ఎంతోమంది నటీనటుల పాత్రలు కూడా చాలా చక్కగా ఉన్నాయి; వారి నటన కూడా అంతే చక్కగా కుదిరింది.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ప్రధానంగా టెక్నికల్ టీమ్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరుని కచ్చితంగా అభినందించకుండా ఉండలేం. సినిమా మొత్తాన్ని సెట్స్‌లోనే షూట్ చేయాల్సిన క్రమంలో వారు తీసుకున్న జాగ్రత్త ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. ఇక సంగీతం కూడా చాలా బాగుంది; పాటలు బాగా వర్కవుట్ అయ్యాయి. అంతే స్థాయిలో నేపథ్య సంగీతం కూడా ఉండడం సినిమాకి ప్రధానమైన అసెట్. ఇక విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. నిడివి కాస్త క్రిస్పీగా కట్ చేసుకుని ఉండొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి; ఇలాంటి సినిమాని చేయడానికి ముందుకు వచ్చిన స్వప్న సినిమాస్‌ని అభినందించకుండా ఉండలేం.
ఫైనల్లీ: ఈ ఛాంపియన్.. ఎంగేజ్ చేస్తూ సాగిన ఫిక్షనల్ లవ్ స్టోరీ విత్ బైరాన్‌పల్లి కనెక్ట్!