రెండేళ్ళ క్రితం వచ్చిన ‘హిట్’ ముగింపులోనే దానికి కొనసాగింపు ఉంటుందని దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. అయితే… విశ్వక్ సేన్ తోనే ఫ్రాంచైజ్ మూవీ ఉంటుందని భావించిన ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ లోకి అడివి శేష్ వచ్చాడు. గర్ల్ మిస్సింగ్ కేస్ చుట్టూ ‘హిట్’ కథ తిరిగితే, సీరియల్ కిల్లర్ ను ట్రాప్ చేసే ఆపరేషన్ తో ‘హిట్ -2’ తెరకెక్కింది.
విశాఖపట్నం ఎస్. పి. కృష్ణదేవ్ (అడివి శేష్) ఎమినెంట్ ఆఫీసర్. అతని దృష్టిలోకి వచ్చిన ఏ కేసునైనా క్షణాల్లో సాల్వ్ చేస్తుంటాడు. పోలీసులతో పోల్చితే క్రిమినల్స్ ది కోడి బుర్ర అనేది అతని గట్ ఫీలింగ్. అలాంటి కృష్ణదేవ్ కు ఓ సైకో సవాల్ విసురుతాడు. పబ్ లో పనిచేసే అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేస్తాడు. అంతేకాదు… తల మాత్రం ఆమెది పెట్టి, మిగిలిన శరీర భాగాలను వేరే వాళ్లవి పెడతాడు. ఒక్క ఆధారం కూడా లభించకుండా జాగ్రత్త పడ్డ ఆ సైకోను పట్టుకునే ప్రయత్నంలో కృష్ణదేవ్ ఓ తప్పటడుగు వేస్తాడు. దాన్ని సరిదిద్దుకునే లోపే కృష్ణదేవ్ ఫ్యామిలీనీ సైకో టార్గెట్ చేస్తాడు. అసలు ఈ సీరియల్ కిల్లర్ మోటివ్ ఏమిటీ? అమ్మాయిలను పని కట్టుకుని అతి దారుణంగా ఎందుకు హత్య చేస్తున్నాడు? ఆ కిల్లర్ ఆటలను కృష్ణదేవ్ ఎలా కట్టించాడు? అన్నదే మిగతా కథ.
తొలి చిత్రం ‘హిట్’ తోనే సక్సెస్ ఫుల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శైలేష్ కొలను. దాంతో ‘హిట్ -2’ మూవీ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా డీవియేషన్ లేకుండా స్టార్ట్ టూ ఫినిష్ కథను ఆసక్తికరంగా మలిచాడు. కేవలం రెండు గంటల నిడివిలో ఈ సైకో కిల్లర్ కథ కంచికి చేరిపోవడం అనేది మెయిన్ ఎసెట్. అయితే క్రిస్ప్ గా కథను నడిపే క్రమంలో దర్శకుడు చాలా విషయాలకు వివరణ ఇవ్వకుండా దాటేశాడు. ఆ గ్యాప్స్ అన్నింటికీ ఆడియెన్స్ ఎవరికి వారు పూర్తి చేసుకోవాల్సిందే! రెండు గంటల సేపు థియేటర్ లో ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోపెట్టిన దర్శకుడు, ఓ మధ్య తరగతి కుర్రోడు సీరియల్ కిల్లర్ గా మారిన వైనాన్ని చాలా లైటర్ వీన్ లో చూపడం నిరాశకు గురిచేస్తుంది. తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటనకు అతను ఓ వర్గాన్ని పనికట్టుకుని టార్గెట్ చేయడంలో పస లేకుండా పోయింది. దానికి బలాన్ని చేకూర్చే సన్నివేశాలనూ చూపలేదు. కృష్ణదేవ్ ఠక్కున సాల్వ్ చేసే మొదటి కేసు కూడా పెద్దంత థ్రిల్ కు గురిచేయదు. హంతకుడిని గెస్ చేయడానికి అలాంటి ట్రిక్స్ ను ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో ప్లే చేసిన దాఖలాలు ఉన్నాయి. అలానే రాఘవుడే అసలు పాత్రధారి అని నిర్థారణకు రావడానికి ముందు చేసిన ఇన్వెస్టిగేషన్ కూడా తూతూ మంత్రంగానే సాగిపోయినట్టు తెలుస్తూనే ఉంటుంది. అతన్ని ఎన్ కౌంటర్ చేయడానికి మంత్రితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నించడానికి రీజన్ ను బలంగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇక సైకో టార్గెట్ మహిళా సంఘాల నేతలు అని చెబుతూనే, అతను చంపే వారంతా పాతికేళ్ళ లోపు అమ్మాయిలుగా చూపడం అర్థం లేనిది. కథలో ఇలాంటి లూప్ హోల్స్ ఎన్నో ఉన్నా… ఓవర్ ఆల్ గా కథనం ఆసక్తికరంగా ఉండటంతో డైరెక్టర్ పాస్ అయిపోయాడు.
ఎస్.పి. కృష్ణదేవ్ పాత్రలో అడివి శేష్ చక్కగా ఒదిగిపోయాడు. మొన్నొచ్చిన ‘మేజర్’ సినిమా బయోపిక్ కావడంతో ఆ పాత్ర పోషణకు కనిపించని ప్రతిబంధకాలు ఉంటాయి. కాస్త ఎక్కువా చేయకూడదు… కాస్త తక్కువా చేయకూడదు! కానీ కృష్ణదేవ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ కావడంతో స్వేచ్ఛగా అడివి శేష్ దీన్ని పోషించాడు. అతని ప్రియురాలిగా మీనాక్షి చౌదరి బాగానే సెట్ అయ్యింది. అయితే ఆమె పాత్రకు పెద్దంత ప్రాధాన్యం లేదు. ఓ జిల్లా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ పెళ్ళి చేసుకోకుండా నచ్చిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్టు చూపడంలో ఔచిత్యం ఏమిటనేది డైరెక్టర్ కే తెలియాలి. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాధ్ స్క్రీన్ పెజెన్స్ బాగుంది. రావు రమేశ్ ను పెద్దంతగా ఉపయోగించుకోలేదు. ‘కలర్ ఫోటో’తో హీరోగా మారిన కమెడియన్ సుహాస్ ఇందులో ఓ కీ-రోల్ ప్లే చేశాడు. ఈ మధ్య వచ్చిన ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ చూసి బహుశా ఈ పాత్రకు సుహాస్ సెట్ అవుతాడని దర్శక నిర్మాతలు భావించి ఉంటారు. ఇతర ప్రధాన పాత్రలను భరణి, హర్షవర్థన్, పోసాని, ఆదర్శ్ బాలకృష్ణ. టెంపర్ శివ, శ్రీకాంత్ అయ్యంగార్, గీతా భాస్కర్ తదితరులు చేశారు. ‘హిట్ -3’లో నేచురల్ స్టార్ నాని కీలక పాత్ర పోషించబోతున్నాడనే విషయాన్ని ఈ మూవీ ఎండింగ్ లో రివీల్ చేసేశారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీతో పాటు సంభాషణలూ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే కథనం పైనే కాకుండా, కథ మీద కూడా దర్శకుడు కాస్తంత దృష్టి పెట్టి ఉండాల్సింది. ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ‘ఎ’ క్లాస్ సెంటర్స్ ఆడియెన్స్ ఆకట్టుకుంటుంది!
రేటింగ్ : 3 / 5
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే కథనం
అడివి శేష్ నటన
ప్రొడక్షన్ వాల్యూస్
మూవీ రన్ టైమ్
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ
బోలెడన్ని లూప్ హోల్స్
లింక్ లేని సీన్స్
ట్యాగ్ లైన్: సైకో స్టోరీ