ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ప్రస్తుతం ఆ పార్టీ విబేధాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల గెలిచిన వైసీపీలో.. లోకల్‌గా గుర్తించని అంశాలు చాలా ఉన్నాయి. వైసీపీలోనూ ఒక రేంజ్‌లో అంతర్గత కలహాలు నడుస్తున్నాయి. అవి పార్టీ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఒక్కసారిగా బయటపడ్డాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, శ్రీ అన్నమయ్య జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు పెద్దిరెడ్డి. ఆ హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగానే షాక్ ఇచ్చారు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు. మొదటిసారిగా మాజీ మంత్రి శంకర నారాయణపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
పెద్దిరెడ్డి.. కదిరి నియోజకవర్గంలో అడుగు పెట్టగానే ఆయనకు పెనుకొండ వైసీపీ రెబల్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అది గ్రాండ్ వెల్కమ్ అనే కంటే.. జిల్లాలో సమస్యలకు స్వాగతం చెప్పినట్టుగా కనిపించింది. వచ్చిన వాళ్లంతా మాజీ మంత్రి శంకరనారాయణపై ఆరోపణలు గుప్పించారు. పెనుకొండలో మాజీ మంత్రిని.. ఆయన సోదరుల తీరును స్థానిక పార్టీ నాయకులు తీవ్రంగా విభేదిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతుంటే.. తమపై ఐపీసీ సెక్షన్ 307తోపాటు అనేక కేసులు పెడుతున్నారని పెద్దిరెడ్డికి చెప్పారు. వైసీపీని నమ్ముకుని భార్య తాళిబొట్టు అమ్మి గెలిపిస్తే.. ఈరోజు సరైన గుణపాఠం చెప్పారని వాపోయారట. భార్యా బిడ్డల్ని వదిలి బయట ఎక్కడో బతుకుతున్నామని కున్నీరుమున్నీరయ్యారట. నాయకులు, కేడర్ చెప్పింది విన్నాక.. నిజానిజాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని.. హామీ ఇచ్చారట పెద్దిరెడ్డి. అక్రమ కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారట.
మంత్రి పెద్దిరెడ్డికి ఎంట్రీలోనే ఇలాంటి షాక్ తగిలితే.. పుట్టపర్తికి వచ్చాక ఇంకో షాక్ చూడాల్సి వచ్చింది. కోఆర్డినేటర్ హోదాలో ఎమ్మెల్యేలు ఎంపీ, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం నిర్వహించారు. అర్ధగంట రహస్యంగా సమావేశం జరిగింది. భేటీ అయ్యాక తిరిగి వెళ్లిపోతున్న మంత్రి పెద్దిరెడ్డిని పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎంతసేపూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడి.. మమ్మల్ని పట్టుకోరా అని మంత్రి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లేపాక్షి, చిలమత్తూరుకు చెందిన పార్టీ కేడర్‌ను పోలీసులు పక్కకు లాగి పడేశారు.
గతంలో టీడీపీ వల్ల ఇబ్బందులు పడితే.. ఇప్పుడు సొంత పార్టీ వారితోనే కష్టాలు తప్పడం లేదని.. మంత్రి వెళ్లిపోయాక మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు లోకల్ వైసీపీ నేతలు. కనీసం తాము చెప్పేది వినే ఓపిక కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తానికి రీజినల్ కోఆర్డినేటర్ హోదాలో వచ్చిన పెద్దిరెడ్డికి..తొలిరోజే రెండు నియోజకవర్గాల్లోని అసమ్మతి సెగ గట్టిగా తాకింది. పైగా ఎమ్మెల్యేలపై ఉన్న అసమ్మతి తీవ్రతను ఆ రెండు ఘటనలు తెలియజేశాయి. మరి.. పెద్దిరెడ్డి ఎలా చెక్ పెడతారో చూడాలి.