Off The Record: తెలుగుదేశం పార్టీనే వైసీపీకి ఆక్సిజన్ అందిస్తోందా? ప్రతిపక్షానికి కావాల్సినంత బూస్ట్ అధికార పార్టీ నుంచే అందుతోందా? అదేంటి…? అలాఎలా జరుగుతుంది…? ఇది వినడానికే ఏదో పచ్చి బూతులా ఉందని అనుకుంటున్నారా? మీ ఫీలింగ్ ఎలా ఉన్నా… వైసీపీ మాత్రం అలాగే భావిస్తోందట. కూటమి సర్కార్ తమకు కావాల్సినంత ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు ఫీలవుతోందట? ప్రతిపక్షం ఎందుకలా భావిస్తోంది? సర్కార్ నిర్ణయాలు ఎలా ఉపయోగపడుతున్నాయి?
Read Also: Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్
ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా… ఏపీలో మొదలైన పొలిటికల్ హీట్ ఇప్పుడు పీక్స్‌కు చేరుతోంది. అంటుకున్న మంట మీద కాస్త నకిలీ మద్యం పడేసరికి ఇక భగ్గుమంటోంది. ఇక్కడే పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోందట ప్రతిపక్షం వైసీపీ. కేవలం కూటమి ప్రభుత్వం ద్వారా.. తమ చేతికి అందిన రెండు అస్త్రాలను ఆలంబనగా చేసుకుని ఫుల్ రీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేయాలనుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్ళు కూడా అవకముందే రాజకీయం రసకందాయంలో పడటం ఆసక్తిగా ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ వైసీపీ అధినేత జగన్ నేరుగా గ్రౌండ్ లోకి వచ్చేయటం ఒకటైతే… పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ డెన్ బయటపడటం, అందులో టీడీపీ నాయకుడి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చడంతో… ఈ రెండూ… సరిగ్గా అవసరమైన టైంలో పార్టీకి అందివచ్చిన ఆక్సిజన్ అని భావిస్తోందట ఫ్యాన్ పార్టీ అధిష్టానం. గెలిచి అధికారంలో ఉన్నా.. ఓడి ప్రతిపక్షంలో ఉన్నా, మేం ఎప్పుడూ ప్రజల పక్షమేనన్న ట్యాగ్‌లైన్‌తో ఈ రెండు అంశాల మీద ఇంకా దూకుడుగా జనంలోకి వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ లైనప్ దెబ్బతిందని ఫలితాల తర్వాత గ్రహించిన అధినేత జగన్… బూత్ లెవల్ నుంచి పీఏసీ వరకూ పునర్నిర్మాణం పూర్తి చేశారు.
ఇక, వెళ్ళే వాళ్ళ గురించి పట్టించుకోకుండా తనతో ఉన్న వాళ్లతోనే రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యారట ఆయన. ఆ క్రమంలోనే.. మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు జగన్. దాంతో పార్టీ కేడర్‌లో కూడా ఊపు వచ్చిందని భావిస్తుండగానే…. చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారం బయటికొచ్చింది. దాంతో ఈ రెండు అంశాల్ని ఏ మాత్రం వదలకుండా… ఇంకా దూకుడుగా జనంలోకి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి పార్టీలు ఆరోపిస్తూ… సిట్ దర్యాప్తు జరుగుతుండగా… ఇప్పుడు నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత పేరే బయటికి రావడం వైసీపీకి మోరల్ బూస్ట్ ఇచ్చినట్టు అయిందట. మమ్మల్ని అంటున్నారు సరే… మరి మీ సంగతేంటని ఎదురు ప్రశ్నించడానికి ఛాన్స్ దొరికినట్టు భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్స్. అటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 10మెడికిల్ కాలేజీలను పీపీపీ విధానం కింద ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వైసీపీ. నిరసనలు, గట్టిగా వాయిస్ వినిపించడం, కోటి సంతకాలు అంటూ రకరకాల కార్యక్రమాలతో దీనిపై జనంలో చర్చ పెట్టగలిగామని, ఆ విషయంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. దాంతో… ఇంకొంచెం దూకుడు పెంచి… దీనిపై మరింత చర్చ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Airtel: ఎయిర్‌టెల్‌కు జరిమానా.. ఏకంగా లక్షల్లో.. ఎందుకంటే?
ఈ విషయంలో ఎంత ఎక్కువ చర్చ, రచ్చ అయితే… తమకు రాజకీయంగా అంత మేలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు మేం అధికారంలోకి వస్తే… పీపీపీలను రద్దు చేస్తామని, కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చి నష్టపోవద్దని ఆ మధ్య జగన్ మాస్ వార్నింగ్ ఇవ్వడం కూడా అందులో భాగమేనన్న అంచనాలున్నాయి. ఇక కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారంటూ అప్పుడు ప్రచారం చేసిన నోళ్ళు ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతుంటే లేవడం లేదు ఎందుకని ప్రశ్నించడం ద్వారా…తమ వాయిస్ గట్టిగానే వినిపించామని భావిస్తున్నట్టు తెలిసింది. అసలు నకిలీ లిక్కర్ ఇష్యూలో గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసిన వ్యక్తి పేరే డైరెక్ట్‌గా బయటికి రావడంతో… ప్రభుత్వం కూడా ఇరుకున పడిందన్న అంచనాలున్నాయి. అందులో కూడా వైసీపీ నేతల ప్రమేయం ఉందని, వాళ్ళు చెబితేనే చేశామని నిందితులు వీడియోలు విడుదల చేసినా… ప్రభుత్వానికి డ్యామేజ్ మాత్రం జరిగిపోయిందన్న లెక్కలున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైపు నుంచి తప్పు ఉందా.. లేదా అనే అంశాన్ని పక్కన పెడితే… వైసీపీకి సరిగ్గా అవసరమైన టైంలో అది బూస్టప్‌లా ఉపయోగపడిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ రెండు పెద్ద ఇష్యూస్‌కు సంబంధించి ఏదో ఒకటి తెగేదాకా వదిలి పెట్టకూడదని వైసీపీ వైపు నుంచి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆరోగ్యం, ప్రాణాలన్న రెండు అంశాలతో డైరెక్ట్‌గా ప్రజల్లోకి ఎక్కే మేటర్స్ కావడంతో…ఫుల్ రీ ఛార్జ్ మోడ్ ఆన్ చేయడానికి అవే సరైన స్విచ్‌లుగా భావిస్తోంది ఫ్యాన్ పార్టీ. వాళ్ళ అంచనాలు.. లెక్కలు ఎలా ఉన్నా… ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్నదాన్ని బట్టే… కొనసాగింపు ఉంటుంది. దీంతో జనంలో కూడా చురుకైన చర్చలు జరిగేలా వైసీపీ అధిష్టానం నెక్స్ట్ ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.