శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయ యాత్రలు ప్రారంభిస్తే తిరుగే ఉండదని భావిస్తాయి పొలిటికల్ పార్టీలు. తాజాగా వైసీపీ తమ మంత్రులతో చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూడా అదేకోవలోకి వస్తుంది. పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 90 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారే. అధికారపార్టీ కూడా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా భావించడంతో.. అంతే అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో సిక్కోలు వైసీపీ నేతలు బాధ్యతలు తీసుకుంటారని లెక్కలేసుకున్నాయి పార్టీ వర్గాలు. అంతర్గత విభేదాలు.. వర్గపోరును పక్కన పెట్టేస్తారని.. కలిసి సాగుతారని ఎన్నో అంచనాలు వేసుకున్నారు. కానీ.. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా కనిపించింది. అదే ఇప్పుడు వైసీపీలో చర్చగా మారింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులు మంత్రులు. ముగ్గురు బలమైన నాయకులు ఉండటంతో సామాజిక సమరభేరి ప్రారంభోత్సం కూడా అంతే బలంగా ఉంటుందని ఆశించారు. ఎవరికి వారు తమ ప్రాంతాల నుంచి భారీగా పార్టీ శ్రేణులను, జనాలను తరలించడంలో పోటీ పడతారని అనుకున్నారట. కానీ.. నాయకులంతా రిజర్డ్వ్‌గానే ఉండిపోయారు. ఈ విషయంలో ఎవరి రిజర్వేషన్స్ వాళ్లు పాటించారట. ఒక్కరు కూడా చొరవ తీసుకోలేదని చెబుతున్నారు. ముందుగా వచ్చిన వేదికపై కూర్చోవడానికి.. అదీ మధ్య సీటులో కర్చీఫ్ వేయడానికి చూపించిన శ్రద్ధ కార్యక్రమంపై చూపించలేదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
సామాజిక న్యాయభేరి అట్టాహాసంగా ప్రారంభించారని.. సక్సెస్ అయిందని వైసీపీలో చర్చ జరుగుతున్నా.. సిక్కోలు వైసీపీ ముఖ్య నేతల వైఖరే ప్రస్తుతం ప్రశ్నగా మారింది. అంతర్గత విభేదాలు ఆ కార్యక్రమంపై ప్రభావం చూపించాయి. అంతా కలిసి రాజుగారికి పాలు పోసినట్టుగా.. కథ నడిపించేశారని గుసగసలు వినిపిస్తున్నాయి. బస్సు యాత్రపై ముందుగానే ప్రణాళికలు వేసినా.. కార్యక్రమం ముందురోజు జనాల తరలింపుపై ఇంఛార్జ్ మంత్రి హైరానా పడిన పరిస్థితి కనిపించింది.
సిక్కోలు వైసీపీ ముఖ్య నేతల తీరుపై కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మంత్రులు పెదవి విరిచినట్టు తెలుస్తోంది. ప్రొటోకాల్ అంశంతో తమ్మినేని సీతారాం కార్యక్రమంలో ఇన్వాల్వ్ కాలేదు. ధర్మాన సోదరులు పెద్దగా ఆసక్తి చూపించలేదని చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి మా ఇల్లు చాలా దూరం అన్నట్టు ఉండిపోయారట అప్పలరాజు. ఇక ఎమ్మెల్యేలకు జనసమీకరణపై సరైన దిశానిర్దేశం చేయలేదట. ధర్మాన సోదరులు ఇగోలుకు పోయినట్టు పార్టీ శ్రేణులే విమర్శిస్తున్న పరిస్థితి ఉందట. వైసీపీ అధిష్ఠానం ఎంతో ప్రతిష్టాత్మకంగా బస్సు యాత్రను తీసుకుంటే.. ఆ తీవ్రత సిక్కోలు నేతల్లో కనిపించలేదని టాక్. ఈ అంశాన్ని పార్టీ పెద్దలు గమనించారని కొందరి వాదన. మరి.. శ్రీకాకుళం వైసీపీ నేతలను దారిలో పెట్టడానికి ఏ మంత్రం వేస్తారో లేదో చూడాలి.