ఎన్నికల షెడ్యులు విడుదల కావడంతో ప్రజలు, పార్టీల దృష్టి కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై పడింది. ఈ ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు ఏలా మారతాయి? ఏ కూటమి నుంచి ఎవరు అభ్యర్ధిగా బరిలో దిగుతారో అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి తమ అభ్యర్ధి గెలుపు కోసం లెక్కలతో కుస్తీ పడుతోంది. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అయితే NDAకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఎవరు ఉంటారు? ఎవరు మద్దతిస్తారు అనేది ఉత్కంఠగా మారుతోంది.
జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయశక్తులను కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు తెలంగాణ సీఎం కేసిఆర్. అలాంటి పార్టీల నేతలతో భేటీ అయ్యి.. కలిసి పనిచేద్దామని చెబుతున్నారు కూడా. వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే జాతీయస్థాయిలో కీలక రాజకీయ పరిణామాలకు ఆస్కారం ఉందటున్నాయి టీఆర్‌ఎస్ వర్గాలు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో.. గులాబీ దళపతి కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. గతంలో రాష్ట్రాల పర్యటన సందర్బంగా శరద్‌పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టే అంశంపై చర్చించారు కేసిఆర్. ఇద్దరి మధ్యా రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేయవచ్చు అనే దానిపై చర్చ కూడా జరిగింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి.. తర్వాత జరిగే రాజకీయ పరిణామాలపై అందరి దృష్టీ నెలకొంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో NDA అభ్యర్ధి రాంనాద్ కోవింద్‌కు మద్దతు ప్రకటించింది టీఆర్ఎస్. ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ఉప్పు నిప్పులా ఉంది. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుసరించే వ్యూహంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరేతే..ఈ ఎన్నికలను టీఆర్ఎస్‌కు సవాల్‌గా విశ్లేషిస్తున్నారు.
ఈ సమయంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా.. జాతీయ స్థాయిలో ఆయన చేసే ప్రయత్నాలపై ఒక అంచనాకు రావొచ్చని అనుకుంటున్నారట. ఒకవేళ కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి మద్దతిస్తే.. తెలంగాణలో అధికారపార్టీకి రాజకీయంగా ఇబ్బంది ఎదురుకాక తప్పదు. బీజేపీ, కాంగ్రెస్ కూటమిల అభ్యర్థులను కాదని సొంతంగా ఎవరినైనా బరిలో దింపి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తే.. కేసీఆర్‌తో కలిసి వచ్చేవారు ఎవరు అన్నదే ప్రశ్న. అందుకే ప్రత్యామ్నాయ అజెండాపై గులాబీ బాస్ వైఖరిని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణ ఎన్నికలకు సమయం ఉండటంతో రాష్ట్రపతి ఎలక్షన్స్‌కు టీఆర్ఎస్ దూరంగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరి వాదన. మరి ఏం జరుగుతుందో చూడాలి.