Off The Record: తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంతమేరకైనా… అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ కేంద్ర నాయకత్వం… ఇక్కడ మాత్రం అస్సలు టచ్ చేయలేదు. ఓవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతుంటే… తాము మాత్రం ఏ క్లారిటీ లేక కామ్‌గా చూస్తూ ఉండాల్సి వస్తోందని బాధ పడుతున్నారట తెలంగాణ కాషాయ నేతలు. ఎందుకిలా జరుగుతోంది? ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఆరా తీస్తున్న నేతలకు వెయిట్…. వెయిట్… ఒకటి రెండు రోజుల్లో మీ నంబర్ కూడా వస్తుందని చెబుతున్నారట అగ్ర నాయకులు. బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో 40 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కాస్త లేటుగానైనా… మా లిస్ట్ లేటెస్ట్‌గా ఉంటుందని చెబుతున్నారు టీ బీజేపీ నేతలు.
Also Read: Bhagavanth Kesari Movie Review: భగవంత్ కేసరి రివ్యూ
అభ్యర్థుల ప్రకటనలో సంచలనాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు మరి కొందరు. బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వాటితో పాటు అస్సలు ఇప్పటిదాకా ఎవ్వరూ ఊహించని పేర్లు సైతం ఫస్ట్ లిస్ట్‌లో ఉంటాయని లీకులు ఇస్తోంది టీ బీజేపీ. పార్టీలో చేరే వారు ఇంకా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు కొందరు నేతలు తాము అక్కడి నుండి పోటీ చేస్తాం, ఇక్కడ నుంచి పోటీ చేస్తాం అంటూ అభ్యర్థుల ప్రకటనకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానంటున్నారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు, ఎల్బీనగర్ అంటున్నారు. ఎల్బీనగర్‌లో ఆయన పోటీ చేస్తే మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి భార్య బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియర్ నాయకురాలు విజయశాంతి సైతం కేసీఆర్ మీద పోటీకి సై అంటున్నారు. ఆమె కామారెడ్డిలో పోటీకి దిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీకి పోటీ చేయాలని తనకు లేకున్నా…
పార్టీ తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలను ఒప్పుకోవాలంటూ ట్వీట్ చేశారామె. పనిలో పనిగా గజ్వేల్ నుంచి బండి సంజయ్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారంటూ ట్విస్ట్ ఇచ్చారు విజయశాంతి.
Also Read: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్లానింగ్ రొటీన్‌కి భిన్నంగా ఉండబోతోందా?
అయితే… కొన్ని నియోజక వర్గాలు తప్ప మిగతా చోట్ల ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై పార్టీ ముఖ్య నేతల్లోనే క్లారిటీ లేదట. దీంతో జాబితా విషయంలో అంతలా బిల్డప్ ఇస్తూ గుంభనంగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు చివరికి తుస్సుమనిపిస్తారా అన్న భయాలు కూడా కొందరిలో ఉన్నట్టు తెలిసింది. మన లిస్ట్ చప్పగా ఉంటుందా లేక డబుల్ మసాలా బిర్యానీలా స్పైసీగా ఉంటుందా అని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోందట. తాజాగా జనసేనతో పొత్తా…. మద్దతా అన్న అంశం కూడా తెర మీదికి వచ్చింది. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో… అభ్యర్థుల ఎంపిక మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న భయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పార్టీ లో ఇంకా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి… రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా చేరికలు ఉంటాయని అంటున్నారు… దీంతో బీజేపీ అభ్యర్థుల్లో ఊహించని వారు ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.