తెలంగాణలో మరోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయా? దీనిపై గతంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఏంటి? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ముఖ్యమంత్రి ప్రకటనలో నర్మగర్భ సంకేతాలు ఉన్నాయా? రాజకీయ వాతావరణం కలిసి వస్తే ముందస్తుకు సై అంటారా?
ఈ వ్యాఖ్యలపైనే తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అని అంతా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ మాటలకు ప్రధాన పార్టీలు స్పందించాయి. గతంలో షెడ్యూల్ కంటే ముందుగానే 2018లోనే అసెంబ్లీకి వెళ్లింది టీఆర్‌ఎస్. ఆ ఎన్నికల్లో 88 చోట్ల గెలిచింది అధికారపార్టీ. రెండోసారి తెలంగాణలో అధికారం చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మరోసారి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వాడీవేడీ చర్చ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు గుప్పించేశారు. దాంతో రాష్ట్రంలో అలాంటి ముచ్చటే లేదని కొద్దినెలల క్రితమే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సీఎం ఇంత స్పష్టంగా చెప్పడంతో ముందస్తు ఎన్నికలు రాబోవని అనుకున్నారు. ఆ చర్చా ఆగిపోయింది. కానీ.. తాజా మీడియా ప్రశ్నలకు గులాబీ దళపతి ఇచ్చిన సమాధానం మళ్లీ ముందస్తు రాజకీయాన్ని రాజేసింది. రాష్ట్రంలో అన్నిపార్టీలు రేపోమాపో ఎన్నికలన్నట్టుగా వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఎవరి సన్నాహాల్లో వారు ఉన్నారు. ఇంతలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమా అని విపక్ష పార్టీలకు కేసీఆర్ సవాల్ చేయడం చూస్తుంటే.. దాల్ మే కుచ్ కాలాహై అని అనుమానిస్తున్నాయి రాజకీయ పక్షాలు.
టిఆర్ఎస్ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని చక్కదిద్దే పనుల్లో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గలలో గెలుపు గుర్రాలు ఎవరో తెలుసుకుంటోంది కూడా. టీఆర్‌ఎస్ గెలుపు కోసం అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారంపైనా ఫోకస్ పెట్టింది అధికారపార్టీ. జిల్లాలోనూ మంత్రుల పర్యటనల స్పీడ్ పెరుగుతోంది. ఇవన్నీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు పడుతున్న అడుగులుగా విపక్షాల సందేహం.
మొత్తంగా ముందస్తు విషయంలో కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో రాజకీయ వాతావరణం తనకు అనుకూలంగా ఉండడంతో… ఎత్తుగడలు వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం చాలా గరంగా ఉంది. వాటిని అధిగమించేలా.. పైచెయ్యి సాధించేలా గులాబీ దళపతి ఏం చేస్తారన్నదే సర్వత్ర ఉత్కంఠ. ముందస్తు విషయంలో ఆయన వేసే ఎత్తుగడలపై ఆరా తీసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.