నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్నిగంటల ముందు బీజేపీ జాతీయ నాయకత్వం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సీటును తెలంగాణకే ఎందుకు ఇచ్చింది? అందులోనూ లక్ష్మణ్‌నే ఎందుకు ఎంచుకుంది అనేది ప్రస్తుతం చర్చగా మారింది.
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెరిగింది. ఇక్కడ పార్టీ యాక్టివిటీ పెరగడంతోపాటు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వ్యూహరచనలు చేస్తోంది బీజేపీ అధిష్ఠానం. ఈ క్రమంలోనే ప్రస్తుతం లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపుతున్నట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. మిషన్ తెలంగాణలో మరో అడుగు పడినట్టుగా లెక్కలు వేస్తున్నారు నాయకులు. అయితే బీజేపీలో చాలా మంది సీనియర్లు రాజ్యసభ ఆశించారు. ఒక్క తెలంగాణనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ సీనియర్లు కాచుకుని ఉన్నారు. వారందరినీ కాదని తెలంగాణకు ఛాన్స్ ఇచ్చింది కాషాయం పార్టీ.
ఈ సమయంలో తెలంగాణ బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు రాష్ట్ర బీజేపీలో చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారు. చాలాపేర్లు చర్చల్లోకి వచ్చాయి. కానీ.. వారెవరికీ పిలుపు రాలేదు. టీడీపీ నుంచి బీజేపీకిలోకి వచ్చిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విజయశాంతి, పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావుతోపాటు ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు వినిపించాయి. ఏపీ నుంచి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి పేర్లనూ చర్చల్లో పెట్టారు. ఒక బలమైన సామాజికవర్గానికి పట్టం కడతారని చర్చ సాగింది. కానీ.. వాటన్నింటినీ తోసిరాజని డాక్టర్ లక్ష్మణ్‌ను ఎంపిక చేయడంతో కాషాయ శిబిరం ఉలిక్కి పడింది.
బీజేపీ పెద్దలు పార్టీలో పాత కాపుకే పట్టం కట్టారు. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్‌కు ఛాన్స్ ఇవ్వడంతో.. రాజకీయంగా మైలేజ్ వస్తుందని లెక్కలేస్తున్నారట. మున్నూరు కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేయడం వల్ల ఆ వర్గం బీజేపీవైపు ఆకర్షితం అవుతుందని భావిస్తున్నారట. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అదే సామాజికవర్గం. మున్నూరు కాపు ఈక్వేషన్ ఏపీలోనూ కొంత పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుందన్నది పార్టీ వర్గాల మాట. మొత్తానికి బీసీ, మున్నూరుకాపు లెక్కల్లో బీజేపీ వేసిన ఈ ఎత్తుగడ చుట్టూనే చర్చ సాగుతోంది. అయితే.. ఇటీవల టీఆర్ఎస్ నుంచి గాయత్రి రవికి రాజ్యసభ ఇచ్చింది. ఏపీలో వైసీపీ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపింది. దీంతో ఈ సమీకరణాల్లో భాగంగానే బీజేపీ కూడా బీసీ మంత్రాన్ని జపించి లక్ష్మణ్‌కు అవకాశం ఇచ్చిందనేవారూ ఉన్నారు. మరి.. ఈ లెక్కలు.. ఎక్కాలు కాషాయ శిబిరానికి తెలంగాణలో ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.